Jun 08,2021 19:53

నిరంకుశ ప్రభుత్వ నిర్బంధ శిబిరాల్లో బలవంతంగా నెట్టివేయబడిన జీవితాలు వారివి. రోజుల తరబడి కాదు, ఏళ్లకు ఏళ్లుగా అసోం సరిహద్దు ప్రాంత జైళ్లకే పరిమిత మయ్యాయి వారి బతుకులు. నిర్బంధ శిబిరాల పేరుతో నిర్వహిస్తున్న ఆ కేంద్రాలు జైళ్లను తలపిస్తుంటాయి. అక్కడ భర్తకు దూరమైన భార్యలు, బిడ్డలకు దూరమైన తల్లులు, నవమాసాలు మోసిన నెత్తుటి గడ్డలను పురిటిలోనే కోల్పోయిన అభాగ్యులు.. ఇలా ఎవరిని కదిపినా కన్నీటిసాగరమే. సాఫీగా సాగిపోతున్న వారి బతుకులను బజారుకీడ్చి నిలువునా ముంచేసిన దగాకోరు ప్రభుత్వ రాతలకు ప్రత్యక్ష సాక్ష్యాలు వారు. కోవిడ్‌ కరాళ నృత్యంతో ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్న వేళ దేశభక్తి ముసుగులో దుష్టపాలకుల సిగ్గుమాలిన చర్యలు మరింత వేగమయ్యాయి.

మమిరాన్‌ నెస్సా (40) గతేడాదే అసోం రాష్ట్ర కొక్రాజ్‌హర్‌ జైలు నుంచి విడుదలైంది. పదేళ్లు శిక్ష అనుభవించిన నెస్సాకు ఇద్దరు కొడుకులు. జైలుకు వెళ్లేనాటికి ఎనిమిదినెలల గర్భవతి. బలవంతంగా జైలుకు ఈడ్చుకెళ్లడంతో గర్భంలోనే బిడ్డను కోల్పోయింది. భార్య దూరమైన బాధలో ఆమెను ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని భర్త అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితమే మరణించాడు. ఈ పదేళ్లలో ఆమె తన బిడ్డలను చాలా తక్కువసార్లే చూసింది. నెస్సా విడుదల కోసం ఆమె తల్లిదండ్రులు చేసిన న్యాయపోరాటానికి వారికున్న కొద్ది భూమి అన్యాక్రాంతమైంది. ఇంతాచేసి బయటకు వచ్చినా ప్రభుత్వం దృష్టిలో ఆమె విదేశీయురాలే. బెయిల్‌ నిబంధనల ప్రకారం ఆమె అక్కడే ఉండాలి. కనీసం బతుకుదెరువు కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే స్వేచ్ఛ కూడా ఆమెకు లేదు. తిన్నా, తినకపోయినా చచ్చేంతవరకు అలాగే బతకాలని పాలకులు రాసిపెట్టారు మరి.

కోవిడ్‌ వేళ పెరిగిన 'నిర్బంధ' జీవితాలు


సబియా ఖాటున్‌ (45) షిమ్లబరి గ్రామ నివాసి. నాలుగేళ్ల జైలు శిక్ష తరువాత లక్ష పూచికత్తు గల రెండు బాండ్లు, వారం వారం పోలీసుస్టేషనుకు వెళ్లి సంతకం చేయాలన్న నిబంధనతో విడుదలైంది. తనను తాను నిరూపించుకునే అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఏవిధమైన రుజువులు ఆమె చూపించలేకపోవడంతో ఆమెను విదేశీయురాలిగా పరిగణించి జైల్లో పెట్టారు. 'నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. కాళ్లు వణుకుతున్నాయి. నడవలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో వారం వారం పోలీసుస్టేషనుకు వెళ్లడానికి ఎంతో కష్టపడు తున్నాను. ఒకవేళ నేను ఏదేని కారణంగా స్టేషనుకు వెళ్లకపోతే నన్ను తిరిగి ఆ శిబిరానికి పంపుతామని అధికారులు చెప్పారు. అందుకే ఇబ్బందిపడుతూనే వెళుతున్నాను' అంటోంది సబియా. సబియా అరెస్టు అయ్యాక ఆమె కుటుంబం ఛిన్నాభిన్నమైంది. రిక్షా తొక్కుకుంటూ జీవించే భర్త భార్య జైలుకెళ్లడంతో తీవ్రంగా కుంగిపోయాడు. రిక్షా నడపడం ఆపేసి రోజంతా ఇంట్లోనే గడిపేవాడు. ఒక్కోసారి బిగ్గరగా ఏడుస్తూ ఉండేవాడు. భర్తను చూసేందుకు ఆమెను పంపించమని ఎన్నిసార్లు అభ్యర్థించినా అధికారులు స్పందించలేదు. ఆమె విడుదలయ్యేసరికి అతను మరణించాడు. భర్త శవాన్ని చూసేందుకు కూడా ఆమెను పంపలేదు. సబియా ఇంటికి వచ్చేసరికి భర్త లేడు, పిల్లలు స్కూలు మానేసి మానవవ్యర్థాలు తీసే పనిచేస్తూ జీవిస్తున్నారు.


దుబ్రి జిల్లా రమరారుకుటి గ్రామం భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉంది. దళిత మహిళ 60 ఏళ్ల శాంతి బస్ఫూర్‌ ఆ గ్రామనివాసి. రెండేళ్ల క్రితం నిర్బంధశిబిరానికి తీసు కళ్లారు. ఈ చర్య ఆ ప్రాంతంలో ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేసింది. 'మా చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఒక పోలీసు అధికారి వచ్చి ఆమె డీ-ఓటరు అని చెప్పి బలవంతంగా నిర్బంధ శిబిరానికి తీసుకెళ్లాడు. ఇది చాలా అన్యాయం' అంటూ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు శాంతి పక్కింటి వ్యక్తి ఇంద్రాణి దాస్‌. 'శాంతి తల్లిదండ్రులు నాకు తెలుసు. ఆమె పుట్టినప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా ను. నా కళ్ల ముందే శాంతి తనను తాను ఈ దేశ పౌరురాలిగా నిరూపించు కునేందుకు ఎన్నో కష్టాలు పడింది' అంటాడు శాంతితో బాగా పరిచయమున్న ఓ వృద్ధుడు. ఇక్కడ శాంతికి భారతదేశ పౌరసత్వం నిరూపించుకునే ధృవపత్రాలు అన్నీ ఉన్నాయి. ఓటర్ల జాబితాలో తన పేరు కూడా ఉంది. అయినా 2017లో ఈ దేశ పౌరసత్వ ధృవపత్రం చూపించాల్సిందిగా విదేశీట్రిబ్యునల్‌ (ఎఫ్‌టి) శాంతిని ఆదేశించింది. అజ్ఞానం వల్లనో లేక పేదరికం కారణంగానో శాంతి ఆ పత్రాలు సమర్పించలేదు. ఆ నేరంతోనే ఆమెను జైలుకు పంపించారు. ఒక వృద్ధురాలు కుటుంబానికి దూరంగా అనారోగ్య సమస్యలతో రెండేళ్లపాటు జైల్లో నరకంచూసింది. ఎట్టకేలకు ఈ నెల మొదటివారంలో ఆమె విడుదలైంది.

కోవిడ్‌ వేళ పెరిగిన 'నిర్బంధ' జీవితాలు


నిర్బంధ శిబిరాలకు వెళ్లినవారే కాదు, పౌరసత్వ జాబితాలో తమ పేర్లు రాలేదన్న మనస్తాపంతో జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందన్న భయంతో ఎంతోమంది తమను తాము అంతమొందించుకున్న సంఘటనలు కూడా అక్కడ ఎక్కువగా కనబడతాయి. డుమ్రిగిరి గ్రామంలో ఉండే పదేళ్ల బాబిడ్యూయల్‌ ఇస్లాం తండ్రి, తన పేరు జాబితాలో లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లవాడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తండ్రి ఎన్నో కలలు కన్నాడు. ఆ కల కల్లగా మిగిలిపోయింది. బాబి బడిమానేసిన పిల్లల జాబితాలో చేరిపోయాడు.


ఇది ఇప్పటి కథ కానేకాదు. మతోన్మాద బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే వేసుకున్న ప్రణాళిక. దేశంలో మైనార్టీలకు నిలువు నీడలేకుండా చేసి వారిని భయభ్రాంతులను చేయాలన్న సమయం కోసం కాచుకుని కూర్చొన్న వారి మార్గాన్ని కరోనా వచ్చి సులువుచేసింది. 2019లో కేంద్రం ప్రవేశపెట్టిన వివాదాస్పద పౌరసత్వ బిల్లు (సవరణ) చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉప్పెనలా ఎగసిపడ్డాయి. అప్పుడే దేశంలో కరోనా వ్యాపిం చడంతో ఉద్యమాలకు తాత్కాలికంగా విరామం వచ్చింది. ఈ సమయంలోనే నిర్బంధశిబిరాల సంఖ్యను అమాంతం పెంచడం, వందల సంఖ్యలో ఉన్న ఖైదీలు వేల సంఖ్యలో పెరిగిపోవడం ముఖ్యంగా లాక్‌డౌన్‌, కరోనా విజృంభణ సైతం లెక్కచేయకుండా ఎంతోమందిని ఈ రెండేళ్లలో ఆ జైళ్లకు తరలించారు.

కోవిడ్‌ వేళ పెరిగిన 'నిర్బంధ' జీవితాలు


మానవహక్కుల సంఘం అనుబంధ సంస్థ 'సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌' (సిజెపి) ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి, బాధితుల కుటుంబాలతో చర్చించి ఆ జైళ్ల నుంచి వారిని విముక్తులను చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. అలా ఎంతోమంది ఇప్పుడు ఆ బంధనాల నుంచి విముక్తులయ్యారు. కాని ఇప్పటికీ ఏదోఒకరోజు ప్రభుత్వం తమని పట్టి తీసుకెళ్తుందేమోనన్న భయం వారిని వెంటాడుతూనే ఉంది. పైగా ఇన్నేళ్లలో వారు కోల్పోయిన జీవితాలు ఎన్నటికీ తిరిగిరావన్న నిజం, ఆప్తులను కోల్పోయిన బాధతో జీవచ్ఛవాళ్లుగా బతుకుతున్నారు.


ఇటువంటి ఎన్నో కన్నీటిగాథలకు నెలవు ఆ ప్రాంతం. దశాబ్దాలుగా ఈ దేశంలో నివసిస్తున్న ఒక వర్గం వారందరినీ విదేశీ ముద్రవేసి వెళ్లగొట్టే ప్రయత్నంలో భాగంగా ఎంతటి దౌర్జన్యానికైనా తెగబడుతున్నారు పాలకులు. ఈ చర్యలు కోవిడ్‌కాలంలో మరింతగా పెరిగాయి. ఆరోగ్య సంరక్షణ లేక కనీసం జీవించే హక్కు కూడా లేని ఆ అభాగ్యుల వెతలు తీరేదెన్నడో?