
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటల 30 నిముషాలకు వర్చువల్ విధానంలో ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం సందర్భంగా.. ప్రధాని మోడీి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని, వ్యాక్సిన్ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా రెండు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. దేశీయ వ్యాక్సిన్ ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. తక్కువ సమయంలోనే భారతదేశానికి టీకా వచ్చిందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఖర్చంతా కేంద్రానిదేనని మోడీ స్పష్టం చేశారు.
1075 కాల్ సెంటర్ ద్వారా టీకా పంపిణీ సందేహాల నివృత్తి..
టీకా పంపిణీకి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. తగినన్ని డోసుల 'కోవిషీల్డ్', 'కోవాగ్జిన్' సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలూ కోవిడ్ టీకా పంపిణీకి సన్నద్ధమయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రతీ సెంటర్లో 100 మందికి కోవిడ్ టీకాను ఇవ్వాలని నిర్ణయించారు. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వైద్యులు, వైద్య సిబ్బందికి టీకా వేయబోతున్నారు. దేశవ్యాప్తంగా 1075 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్ టీకా పంపిణీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
ఎపి లో 332 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 332 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను నేడు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. తొలి విడతలో రాష్ట్రంలో సుమారు 3 లక్షల 80 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ను వేయనున్నారు. మొత్తం 332 కేంద్రాలకు గాను తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 33 కేంద్రాలను ఏర్పాటు చేయగా, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణలో 1213 కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్..
తెలంగాణలో 1213 కేంద్రాల్లో కోవిడ్ టీకా ఇవ్వనున్నారు. నిమ్స్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ టీకా వేయనున్నారు. తిలక్‌నగర్‌లో కరోనా టీకా ప్రక్రియను మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. గాంధీ ఆసుపత్రి, నార్సింగిలోని పిహెచ్సి లో సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడి మాట్లాడనున్నారు.
ప్రత్యేక నిబంధనలతో కోవిడ్ వ్యాక్సిన్..
ప్రత్యేక నిబంధనలతో కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నద్ధమయింది. టీకా ఇచ్చే గదిలో 30 మంది కూర్చునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్‌ను ఏర్పాటు చేశారు. టీకా వేయించుకునే ప్రతి ఒక్కరికి గుర్తుగా ఎడమ చేతి వేలిపై ఎన్నికల్లో వినియోగించే సిరా చుక్క వేస్తారు. టీకా వల్ల రియాక్షన్ వచ్చే అవకాశమున్న 18 ఏళ్ల లోపువారికి, గర్భిణులతోపాటు పాలిచ్చే తల్లులకు టీకాలివ్వరు. కోవిడ్ పాజిటివ్ కాని వాళ్లకు టీకా వేయరు. టీకా వేసుకున్న వాళ్లలో ఎవరికైనా రియాక్షన్ వస్తే ట్రీట్మెంట్ అందించేందుకు రాష్ట్రస్థాయిలో నోడల్ అధికారులను నియమించారు.