Jul 03,2022 07:14

వాయనాడ్‌ : కోవిడ్‌ సమయంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌) లక్షలాది మందికి ఆహారం అందించిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం పేర్కొన్నారు. కానీ ప్రధాని మోడీ మాత్రం యుపిఎ ప్రభుత్వం అమలు చేసిన ఆ పథకం అందించిన భద్రతను, సహాయాన్ని గుర్తించేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఆనాటి యుపిఎ ప్రభుత్వ ''వైఫల్యాల సజీవ స్మారక చిహ్నాలు'' అంటూ ఉపాధి హామీ పథకాన్ని మోడీ అభివర్ణించడాన్ని రాహుల్‌ తప్పుబట్టారు. ప్రజా ఉపాధి పథకం సమగ్రతను ప్రధాని అర్ధం చేసుకోలేదన్నారు. లక్షలాదిమందికి బాగా రక్షణ కల్పించిందన్నారు. ఒకపక్క నోట్ల రద్దుతో, జిఎస్‌టి తప్పుడు అమలుతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతుంటే, సామాన్యులకు జీవనభృతిని కల్పించడంలో ఈ పథకం చాలా కీలకంగా మారిందన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో గిరిజనులు అధికంగా గల నెన్మెని గ్రామ పంచాయితీలో 'ఉపాధి' వలంటీర్లనుద్దేశించి రాహుల్‌ ప్రసంగించారు. ఇదొక డబ్బు వృధా కార్యక్రమం అంటూ పథకం ప్రవేశపెట్టిన నాడు చాలామంది విమర్శించారని, కానీ అది, మన దేశ మౌలిక సదుపాయాలను, మన ప్రజలు స్వశక్తితో నిర్మించుకునే ఆలోచన అని రాహుల్‌ కొనియాడారు.