Apr 20,2021 21:49

వి.రాంభూపాల్‌

        అనంతపురం : జిల్లాలో కోవిడ్‌ కేసులు ఉధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నివారణ, సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సానిక గణేనాయక్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలకు మాస్కులు, సానిటైటర్లను అందించడంలో దాతలు ముదుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక అధికారులు ప్రకటిస్తున్న కోవిడ్‌ కేసులకు, వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన రోగి నుంచి వ్యాధి విస్తరించకుండా వేరు చేసి, వైద్యం అందించేవారన్నారు. ప్రస్తుతం అలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. టీకా వేయించుకోవడానికి, కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారన్నారు. వారికి అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం మౌనంగా ఉండడం దారుణం అన్నారు. మున్సిపాల్టీలు, పంచాయతీల్లో వాహనాల ద్వారా అవగాహన ప్రచారం, కరపత్రాల పంపిణీ చేయాలన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా మెరుగైన సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు ఉండడం లేదన్నారు. కరోనా బారిన పడిన వారి నుంచి కొన్ని ప్రయివేటు ఆసుపత్రులు చికిత్సల పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నాయని చెప్పారు. రెమిడెసివర్‌ వ్యాక్సిన్‌ను రూ.10 నుంచి రూ.15 వేలకు అమ్ముతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకే పరీక్షలు చేయాల్సి ఉన్నా, కొన్ని ప్రయివేటు ఆసుపత్రులు వేలాది రూపాయలు తీసుకుంటున్నాయని చెప్పారు. అధికారులు వీటిపై నిఘా ఉంచాలని కోరారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్లో మనో ధైర్యం నింపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.