Jun 10,2021 19:57

ముంబై : కోవిడ్‌-19కు సంబంధించి ఎవరికివారు వ్యక్తిగతంగా స్వీయ పరీక్ష చేసుకునేందుకు ఉద్దేశించబడిన 'కోవిఫైండ్‌' ర్యాపిడ్‌ యాంటీజన్‌ టెస్ట్‌ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ఐసిఎంఆర్‌) ఆమోదం తెలిపినట్లు గుజరాత్‌కు చెందిన తయారీ సంస్థ మెరిల్‌ డయగ్నోస్టిక్స్‌ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా పరిశోధన చేసి, అభివృద్ధి పరచిన ఈ టెస్ట్‌ కిట్‌ కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా గుర్తించగలదని తెలిపింది. తద్వారా ఐసిఎంఆర్‌ తాజా మార్గదర్శకాల ప్రకారం వైరస్‌ ప్రభావ లక్షణాలు ఉన్న వ్యక్తులు, కరోనా నిర్ధారణైన వారితో కాంటాక్టు అయిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు కోవిఫైండ్‌ను వినియోగించవచ్చని పేర్కొంది. ఇంట్లోనే పరీక్ష చేసుకునే సదుపాయం ఉన్న కోవిఫైండ్‌ కిట్‌ మధ్యస్థం నుంచి అధిక లక్షణాలు ఉన్న వారిలో సమర్ధవంతంగా పనిచేస్తుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్ష ద్వారా వేగంగా 15 నిమిషాల్లోనే ఫలితం వస్తుందని, రిఫ్రిజరేషన్‌ వంటి ప్రత్యేక నిల్వ సదుపాయాలు అవసరం లేదని తెలిపింది. టెస్ట్‌ కిట్‌ ధర రూ.250 అని, సింగిల్‌ ప్యాక్‌గా అందుబాటులో ఉంటుందని పేర్కొంది.