Jan 14,2021 06:58

కొత్త కొత్త ఎత్తుగడలతో
రంగుల గాలి
బాహాటంగా వీస్తోంది
వర్గాలుగా
విభజింపబడుతూ
ఖండాలుగా చీల్చబడుతూ
నిరుపయోగమైన
ప్రదేశాల చుట్టూ తిరుగుతోంది
మట్టి కుప్పలకింద
నలిగిపోయిన చేయి
అప్పుల రాశి ముందు
మోకరిల్లిన బతుకులు
గుడిసె పై కప్పు పైకి
వీచని గాలిప్పుడు
బడా బాబుల జేబుల చుట్టూ
ప్రదక్షిణలు చేస్తోంది
కొత్త గాలి సరికొత్తగా
తన తీరు తెన్నులు మార్చుకుని
ఒళ్ళంతా కళ్ళు చేసుకుని
కనపడకుండా
వినపడకుండా
ఉన్నత శిఖరాల వైపు
హోరున కదిలిపోతోంది
ఎదగాలంటే
దుమ్ము ధూళి
నెత్తిన వేసుకోవడం కాదని
కొత్త యుద్ధం నేర్పింది
నిరసన పేజీ తెరిచింది
కొత్త గాలి ఆరాటమంతా
కుర్చీల కోసమే కుస్తీగాని
విరిగి పడిన
దేశ వెన్నెముక కోసం కాదు.
                                 * నరెద్దుల రాజారెడ్డి, సెల్‌ : 96660 16636