Jun 10,2021 18:21

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రస్తుతం దేశీయంగా తయారైన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లతో పాటు రష్యన్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌లను ప్రజలందరికీ ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొవిషీల్డ్‌ రూ. 780, స్పుత్నిక్‌ రూ. 1,145 కాగా, కొవాగ్జిన్‌ ధర సర్వీస్‌ ట్యాక్స్‌ రూ.150తో కలిపి రూ. 1410గా కేంద్రం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ కూడా రూ. 1368(19 డాలర్ల)కే లభిస్తోంది. అయితే కొవాగ్జిన్‌ ధర మాత్రం ఎందుకింత ఎక్కువగా ఉందంటే.. కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌లతో పోల్చితే కొవాగ్జిన్‌ తయారీలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం అధిక ఖర్చుతో కూడుకుందని భారత్‌ బయోటెక్‌ పేర్కొంటుంది. ఈ  వ్యాక్సిన్‌ కోసం నిష్క్రియం చేసిన వైరస్‌ను అధిక మొత్తంలో వినియోగిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థలోని బిఎస్‌ఎల్‌ ల్యాబ్‌లో అత్యంత భద్రతా ప్రమాణాల మధ్య వైరస్‌ను వృద్ధి చేసిన అనంతరం వాటిని నిష్క్రియం ( అచేతన స్థితి)లోకి మారుస్తుంది. దీని కోసం వందలాది లీటర్ల స్పెర్మ్‌ను దిగుమతి చేసుకోవాల్సి వుంటుంది. ఇది అధిక ఖర్చుతో కూడుకున్నదని సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయోలజీ సెంటర్‌ ఫర్‌ అడ్వైజర్‌ రాకేష్‌ మిశ్రా తెలిపారు. అయితే కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌లను ఎంఆర్‌ఎన్‌ఎ పరిజ్ఞానంతో రూపొందిస్తారు. వీటికోసం వైరస్‌లు అవసరం లేదని.. కేవలం స్పైక్‌ ప్రోటీన్‌ సరిపోతుందని అన్నారు. అలాగే వీటి తయారీ కోసం ల్యాబ్‌ వంటి విస్తృతమైన సౌకర్యాలు ఉండాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. అదేవిధంగా ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌లు కూడా ఎంఆర్‌ఎన్‌ఎ పరిజ్ఞానంతోనే రూపొందుతున్నాయని తెలిపారు.

గతంలో అభివృద్ది చేసిన వ్యాక్సిన్‌ల కంటే కరోనా వ్యాక్సిన్‌లే అత్యంత ఖరీదైనవని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు డిపిటి, హెపటైటిస్‌ బిలను నిరోధించే పెంటవలెంట్‌ వ్యాక్సిన్‌ ఒక మోతాదును రూ. 17.37కి అందిస్తోంది. అలాగే యునిసెఫ్‌కి సీరమ్‌ అందిస్తున్న మశూచి వ్యాక్సిన్‌ ఒక్క డోసు ధర రూ. 30.00 కాగా, అమెరికా రూ. 39.6 చెల్లిస్తోంది. రాబిస్‌ వ్యాక్సిన్‌ ఒక్క డోసు ధర రూ. 200 మాత్రమే.. రాబిస్‌ వ్యాక్సిన్‌ను కూడా భారత్‌ బయోటెక్‌ కంపెనీనే వైరస్‌లను నిష్క్రియం చేసే పద్ధతిలోనే రూపొందించారు. అలాగే తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కి మాత్రం జిఎస్‌టితో కలిపి రూ. 1200 ఎందుకు వసూలు చేస్తోందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముడి సరుకు, ప్యాకేజింగ్‌లతో పాటు ల్యాబ్‌ నిర్మాణం, నిర్వహణ, లైసెన్స్‌ పొందేందుకు ఖర్చు, ఉత్తత్తి ఖర్చు, క్లినికల్‌ ట్రయల్స్‌ ఇవన్నీ కలుపుకుని వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించడం జరుగుతుంది. మార్కెటింగ్‌, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం వంటి వాటితో కలిపి మరో 30 శాతం ఖర్చు అవుతుంది. ట్యాక్స్‌, పంపిణీ, రవాణా, నిల్వ, మెడికల్‌ సిబ్బందికి చేరేందుకు మరికొంత ఖర్చు ఉంటుంది. ఉత్పత్తి ఖర్చు కంటే మూడు రెట్లు అధికంగా వ్యాక్సిన్‌ల ధరలను నిర్ణయించారని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. టీకా ఉత్పత్తికి వాటర్‌ బాటిల్‌ ధరలో ఐదో వంతు కన్నా తక్కువ ఖర్చు మాత్రమే అవుతుందని భారత్‌ బయోటెక్‌ సంస్థకి చెందిన కృష్ణ ఎల్లా గతంలో స్పష్టం చేశారని, మరి ఇప్పుడు కొవాగ్జిన్‌కు ఎందుకు ఇంత అత్యధిక ధరను వసూలు చేస్తున్నారని సామాజిక కార్యకర్త బివి. శేషగిరి ట్విటర్‌లో ప్రశ్నించారు.

కొవాగ్జిన్‌కే ఎందుకు అత్యధిక ధర..?