
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసుకుా రెండో డోసుకు మధ్య 6 లేదా 8 వారాల విరామం ఉత్తమమని సీరమ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ తెలిపారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే డోసుల మధ్య 28 రోజులకుపైగా విరామం ఉన్న పక్షంలో దీని సామర్థ్యం పెరుగుతుందని సీరమ్ సంస్థ సిఇఒ ఆదార్ పూనావాలా తెలిపారు. ఈ విషయమై సురేష్ జాదవ్ మాట్లాడుతూ.. కొన్ని వారాల పాటు ఈ గ్యాప్ పెరిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. నాలుగు వారాల గ్యాప్ ఉన్నా మంచిదేనని, లేదా 6 లేక 8 లేదా 10 వారాలు విరామం మరీ మంచిదని వివరించారు. ఫేజ్-3లో క్లినికల్ ట్రయల్స్‌ను 28 రోజుల గ్యాప్‌తో నిర్వహించామన్నారు. రెండు డోసులు త్వరగా తీసుకుంటే దీన్ని తీసుకున్నవారికి 70 శాతం ప్రొటెక్షన్ ఉంటుందని, ఎక్కువకాలం రక్షణ పొందాలనుకుంటే 6 నుంచి 8 వారాల తరువాత మరో డోసు తీసుకుంటే ఇంకా మంచిదని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా వాక్సిన్ తీసుకోవలసిందేనని తెలిపారు. కొందరికి రెండుసార్లు ఈ మహమ్మారి సంక్రమించడమే ఇందుకు కారణమన్నారు. రెండు టీకా మందులనూ మిశ్రమం చేయరాదని, ప్రతి డోసు డిఫరెంట్ వ్యాక్సిన్ నుంచి వచ్చిందని తెలిపారు. మరిన్ని విషయాలను పేరు పొందిన నిపుణులు గానీ, ఇండియన్ మెడికల్ రీసెర్చ్ సంస్థ గానీ ఇప్పటివరకు ఎందుకు వివరించలేదని అంటున్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్‌కు కూడా ఈ సూత్రం వర్తిస్తుందా? అన్నది తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.