
ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్ : మన్యం జిల్లా క్రీడాకారులు క్రీడా పోటీల్లో సత్తాచాటి, జిల్లా కీర్తి ప్రతిష్టలను రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపజేయాలని ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర కోరారు. జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలను పట్టణంలోని ఆర్సిఎం ప్రాంగణంలో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఎంతో కష్టపడి జిల్లా స్థాయికి వచ్చారని, ఇదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయిలో కూడా గెలుపొందాలని ఆకాంక్షించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, కానీ క్రీడా స్ఫూర్తి ముఖ్యమని పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా సాధన చేయాలని క్రీడాకారులకు సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని చెప్పారు. క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కోరారు. ఓటమితో కుంగి పోరాదని, మళ్లీ ప్రయత్నం చేయాలని ఉద్బోధించారు. ఎవరికీ విజయం అంత సులువుగా రాదని, కష్టపడితేనే సాధ్యమవుతుందని తెలిపారు. మన జిల్లాకు క్రీడా ప్రాంగణం (స్టేడియం) అవసరం ఎంతో ఉందని, ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ మాట్లాడుతూ సచివాలయాల్లో స్పోర్ట్స్ క్లబ్ ఉందని, ప్రతీ క్రీడాకారుడు అందులో నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఐటిడిఎ పిఒ విష్ణు చరణ్, మున్సిపల్ చైర్మన్ బి.గౌరీశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి.మంజుల వీణ, జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరరావు, డిఎస్పి ఎ.సుభాష్, అర్జున అవార్డు గ్రహీత ఎస్.జయరామ్, తహశీల్దారు శివన్నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.