Jun 11,2021 21:32

స్వాధీనం చేసుకున్న మద్యాన్ని చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి విలేకరులు.. పెనుకొండ :పెనుకొండ పోలీసులు భారీ స్థాయిలో కర్నాటక మద్యాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మహబూబ్బాషా, పెనుకొండ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రమేష్‌ బాబుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గురువారం రాత్రి వాహనాల తనీఖీలు చేస్తున్న సమయంలో సెప్టిక్‌ ట్యాంక్‌ లో అక్రమంగా తరలిస్తున్న 180 ఎంఎల్‌ టెట్రా ప్యాకెట్ల 25 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పావగడ కు చెందిన జి.నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి కర్నాటక నుంచి సెప్టిక్‌ ట్యాంక్‌ ద్వారా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. సెప్టిక్‌ ట్యాంక్‌ పైలెట్‌తో పాటు శ్రీనివాసులు, నాగరాజు అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అదేవిధంగా గురువారం రాత్రి మరువ పల్లి కి చెందిన బోయ రామంజి, బోయ మూర్తిని కూడా అరెస్టు చేసి వారివద్దనుంచి నాలుగు మద్యం బాక్సులను, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసినట్లు చెప్పారు.
కళ్యాణదుర్గం :పట్టణంలో కర్నాటక మద్యం విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన బోయ అనిత, పరమేశ్వర, అచ్చువల్లి సురేష్‌, అక్కమ్మలను అరెస్టు చేసి వారి నుంచి 325 కర్నాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తేజోమూర్తి తెలిపారు.