
బెంగళూరు : వేతన సవరణ డిమాండ్‌తో కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్టిసి) ఉద్యోగులు బుధవారం ఉదయం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. కెఎస్ఆర్టిసి ఎంప్లాయిస్ లీగ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. సమ్మెకు కెఎస్ఆర్టిసి ఉద్యోగులతోపాటు, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బిఎంటిసి), నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, నార్త్ ఈస్టరన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ల ఉద్యోగులు మద్దతు తెలిపారు. కెఎస్ఆర్టిసి పరిధిలోని సుమారు 30 వేల బస్సులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు లక్షా ముఫై వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గన్నారు. సమ్మె నేపథ్యంలో బెంగళూరు యూనివర్శిటీ, బెంగళూరు సెంట్రల్ యూనివర్శిటీతో సహా అనేక యూనివర్శిటీలు పరీక్షల్ని వాయిదా వేశాయి. కెఎస్ఆర్టిసి ఎంప్లాయిస్ లీగ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్ర శేఖర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రవాణా ఉద్యోగులకు 6వ పే కమిషన్‌ను అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆందోళనలు చేయడం నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేయడం లేదని తెలిపారు.
ఉద్యోగులకు యడ్యూరప్ప సర్కారు బెదిరింపులు
ఉద్యోగుల సమ్మెపై కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా ఉంది. ఉద్యోగుల డిమాండ్లపై ఎలాంటి చర్చలు జరిపేది లేదని ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టం చేశారు. సమ్మె విరమించి విధులకు హాజరైన తరువాతే చర్చలు జరుపుతామని చెప్పారు. విధులకు హాజరుకాని ఉద్యోగులపై తీవ్ర చర్యలు ఉంటాయని బెదిరింపులకు దిగారు.