Jan 18,2022 09:15
  • శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142
  • 4.6కోట్లమంది పేదరికంలోకి : ఆక్స్‌ఫాం

న్యూఢిల్లీ : మనదేశంలో కరోనా సంక్షోభ సమయంలోనూ కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకొని..బిలియనీర్లుగా మారారు. 100మంది అత్యంత ధనికుల వద్ద రూ.57.3లక్షల కోట్ల సంపద ఉందని 'ఆక్స్‌ఫాం ఇండియా' తాజా నివేదిక తెలిపింది. సంపద కొద్ది మంది చేతుల్లో చిక్కడానికి ప్రభుత్వ విధానాలే కారణమని 'ఆక్స్‌ఫాం' తెలిపింది. 'ఇనీక్వాలిటీ కిల్స్‌' పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న 2021లో కొత్తగా 40మంది శతకోటీశ్వరుల హోదాను అందుకున్నారు. వీరి సంఖ్య దేశంలో 102 నుంచి 142కు పెరిగింది. శతకోటీశ్వరుల సంపద రూ.30లక్షల కోట్లు పెరిగింది. రూ.23.14 లక్షల కోట్ల నుంచి రూ.53.16లక్షల కోట్లకు చేరుకుంది. ఇదే కోవిడ్‌ సంక్షోభ సమయంలో 4.6కోట్లమంది తీవ్రమైన పేదరికంలోకి కూరుకుపోయారు. దేశ జనాభాలో అట్టడుగున ఉన్న 50శాతం మందికి జాతీయ సంపదలో దక్కిన వాటా కేవలం 6శాతం మాత్రమే ఉంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ఆదాయాలు పడిపోయి పేదరికంలోకి వెళ్లిపోయిన జనాల్లో సగం భారత్‌ నుంచే ఉన్నారు. అత్యంత ధనికులు, శతకోటీశ్వరులపై సంపద పన్ను పెంచాలని ఆక్స్‌ఫాం ఇండియా సూచించింది. వారి సంపదలో 1శాతం పన్నుగా ప్రభుత్వానికి ఆదాయం లభించినా..అది రూ.50వేల కోట్లు అవుతుందని, ఈ మొత్తంతో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించవచ్చునని నివేదిక తెలిపింది. దేశంలో 98మంది అత్యంత ధనికులపై కేవలం 4శాతం సంపద పన్ను వేస్తే.. రెండేళ్లు హెల్త్‌ బడ్జెట్‌కు, 17 ఏళ్లు మధ్యాహ్న భోజనం బడ్జెట్‌కు సరిపోతుంది.