May 05,2021 08:42

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌లో నిరుద్యోగాన్ని మరింతగా పెంచుతోంది. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు ఎనిమిది శాతం పెరిగి నాలుగు నెలల అత్యధికానికి చేరింది. భవిష్యత్తులో లాక్‌డౌన్లు, ఆంక్షలు తీవ్రం కానుండటంతో పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. మార్చిలో నిరుద్యోగ రేటు 6.5 శాతం ఉండగా, ఏప్రిల్‌లో అది 7.97 శాతానికి చేరింది. కిందటి నెలలోనే దాదాపు 75 లక్షల ఉద్యోగాలు పోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) సంస్థ పేర్కొంది. ''ఉద్యోగాల లభ్యతలో కొరత నెలకొంది. ఇది లాక్‌డౌన్ల వల్ల కావచ్చు'' అని సిఎంఐఇ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేష్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. ''వైరస్‌ ఇప్పటికీ చాలా తీవ్రంగా ఉంది. వైద్య ఆరోగ్య సేవల విషయంలో ఒత్తిడికి గురవుతున్నాం. వైరస్‌ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో మేలో కూడా పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది'' అని వివరించారు.
 

                                                        రెండంకెల వృద్ధి అనుమానమే

   బలహీనమైన ఆర్థిక అంచనాల నేపథ్యంలో భారత్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల అభివద్ధిని సాధిస్తుందని చెప్పలేమని చాలామంది ఆర్థికవేత్తలు తమ అంచనాలను సవరించారు. రాష్ట్రాల వారీగా ఆంక్షలు పెరిగే కొద్దీ వీటిల్లో మరింత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బార్ల్కెస్‌ బ్యాంక్‌ పిఎల్‌సి సోమవారం తన అంచనాలను సవరిస్తూ 10 శాతం తగ్గించింది. భారత్‌లో పెరుగుతున్న కేసులు, మందగించిన వ్యాక్సినేషన్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని దెబ్బతీస్తాయని అంచనా వేసింది.
   దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలు వైరస్‌ కేసుల వరదను తట్టుకోలేక పోవడంతో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌, ఇంకా ఇతర ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలనా యంత్రాంగాలు విధించాల్సి వస్తోంది. ''కరోనా కేసులు, మరణాల సంఖ్య చుట్టూ అనిశ్చితి పెరుగుతోంది'' అని ఆర్థికవేత్త రాహుల్‌ బజోరియా ఒక పరిశోధన నోట్‌లో రాశారు. ''నెమ్మదిగా టీకాలు వేయడం కూడా భారతదేశ పునరుద్ధరణ అవకాశాలను దెబ్బతీస్తోంది'' అని పేర్కొన్నారు. ప్రస్తుత 13 నెలల ఉపాధి రేటు బలహీనంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్‌లో తయారీ రంగం ఇంకా ఉద్యోగాలు కోల్పోతోందని ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌ సోమవారం ఒక ప్రత్యేక సర్వేలో తేలింది. సిఎంఐఇ డేటా ప్రకారం ప్రభుత్వం నుంచి రియల్‌ టైమ్‌ ఉపాధి డేటా లేనప్పుడు ఆర్థికవేత్తలు నిశితంగా ట్రాక్‌ చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండటం వల్లే కార్మికులు అక్కడి నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. శ్రమశక్తి రేటు ఏప్రిల్‌లో 40 శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ''కొంతమంది నిరాశకు గురై కార్మిక మార్కెట్‌ను విడిచిపెడతారు. సమస్య ఏమిటంటే, భారత ఆర్థిక వ్యవస్థ వారికి తగిన ఉద్యోగాలు కల్పించలేకపోవడం. కాబట్టి ఆదాయాలు పడిపోతున్నాయి'' అని వ్యాస్‌ పేర్కొన్నారు.