Jul 21,2021 15:40

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. తొలి వేవ్‌తో పోల్చుకుంటే రెండవ వేవ్‌లో అత్యధిక కేసులు, మరణాలు సంభవించాయి. దీని ధాటికి కుటుంబాలకు కుటుంబాలే ఛిన్నాభిన్నమైయ్యాయి. అయితే ఈ కరోనా సమయంలో మోడీ సర్కార్‌ అధికారిక లెక్కల ప్రకారం మహమ్మారితో 4.18 లక్షల మంది చనిపోగా...ఈ సంఖ్య కన్నా ఎక్కువ ఉంటుందని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ నూతన అధ్యయనంలో తేలింది. 49 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని చెబుతోంది. అయితే ఇవన్నీ కరోనాతో చనిపోయిన కేసులుగా మాత్రం పేర్కొన లేదు. ఈ అధ్యయనానికి సహ రచయితగా మాజీ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రమణ్యన్‌ ఉన్నారు. కరోనా మొదలైన నాటి నుండి జూన్‌ వరకు ఇన్ని మరణాలు సంభవించాయని అధ్యయనంలో తెలిపింది. కాగా, కరోనా విలయానికి అత్యధికంగా ప్రాణాలు కోల్పోయిన దేశాల్లో భారత్‌ ఉంది. అమెరికా, బ్రెజిల్‌ తర్వాత మూడవ స్థానం ఇండియాదే. ఈ నివేదిక వెలువడంతో మరణాలపై దేశ వ్యాప్తంగా ఆడిట్‌ జరపాలని నిపుణుల నుండి ఆందోళనలు మొదలయ్యాయి.
గత ఏడాది కంటే ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ప్రజలు కోవిడ్‌ డెల్టా వేరియంట్‌తో పిట్టల్లా రాలిపోయారు. కరోనా విస్తృత రూపం దాల్చడంతో ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి.. ఒక్క మేలోనే 1,70,000 వేల మంది చనిపోయారని డేటా చెబుతోంది. విషాదకరమైన అంశమేమిటంటే..ఈ కరోనా సమయంలో వేలల్లో కంటే లక్షల్లో ప్రాణాలు విడిచారని నివేదిక తెలుపుతోంది. అధికారిక గణాంకాల కన్నా... 34 లక్షల నుండి 49 లక్షల మరణాలు ఈ కరోనా సమయంలో సంభవించి ఉంటాయని అంచనా వేసింది. ఈ మరణాల అన్నింటిపై దృష్టి సారిస్తామని, పాండమిక్‌ ముందు సంబంధించిన అదనపు మరణాలను అంచనా వేస్తామని, కాలానుగుణంగా సంఖ్యను మార్పు చేస్తామని రచయిత తెలిపారు. కాగా, ఈ అధ్యయనంపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించాల్సి ఉంది. కోవిడ్‌-19 మరణాలు అంచనా వేయాలంటే ఈ అదనపు మరణాలను అంచనా వేయాల్సిన ఆవశ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ స్పందిస్తూ... ప్రతి దేశంలో అదనపు మరణాలను లెక్కించాలని, భవిష్యత్తులో వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థను సిద్ధం చేయడానికి, తదుపరి మరణాలు సంభవించడకుండా చూసేందుకు ఇదే ఏకైక మార్గమని అన్నారు. కాగా, న్యూయార్క్‌ టైమ్స్‌ సుమారు కరోనాతో 6 లక్షల మంది చనిపోయి ఉంటారని చెబుతుండగా... వీటిని భారత్‌ తోసిపుచ్చింది.