May 03,2021 20:28

ప్రజాశక్తి - పార్వతీపురం (విజయనగరం జిల్లా)
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి (పార్వతీపురం) రెడ్డి శ్రీరామ్మూర్తి (57) కరోనాతో సోమవారం కన్నుమూశారు. 15 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందారు. ఊపిరి ఆడని సమస్య తరచూ ఎదుర్కొంటుండడంతో నాలుగు రోజుల క్రితం ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరారు. అయినా, ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి మరణించారు. ఆయన భౌతికకాయాన్ని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.వి.రమణ, రెడ్డి శంకర్రావు, సిఐటియు, యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పలు ప్రజాసంఘాల నాయకులు సందర్శించారు. సిపిఎం జెండాను కప్పి నివాళులర్పించారు. భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో ఆయన స్వగ్రామం రెడ్డివానివలస తీసుకెళ్లారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
సీతానగరం మండలం రెడ్డివానివలసకు చెందిన రెడ్డి అప్పలనాయుడు, పారమ్మకు శ్రీరామ్మూర్తి మొదటి సంతానం. ఇంటర్‌ చదివిన ఆయన డివైఎఫ్‌ఐలో 1986, 87లో పని చేశారు. 1988లో సిపిఎంలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. 1989లో శ్రీదేవితో ఆయనకు వివాహమైంది. 1992 నుంచి పార్వతీపురం కేంద్రంగా సిపిఎం అభివృద్ధికి కృషి చేశారు. పార్టీ పరంగా జిల్లా విభజన జరిగిన నేపథ్యంలో 2018 నుంచి పార్వతీపురం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1995లో లచ్చయ్యపేట సుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలపై పోరాడారు. 2005-06లో తోటపల్లి నిర్వాసితుల సమస్యలపై జరిగిన పోరాటంలో కీలకపాత్ర వహించారు. దళిత, గిరిజన, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బడిదేవరకొండ, బోరుకొండల్లో గ్రానైట్‌ అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారు. శ్రీరామ్మూర్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు ఉదరుకు ఇటీవలే వివాహమైంది. రెండో కుమారుడు కిరణ్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. శ్రీరామ్మూర్తి భార్య శ్రీదేవి ఐద్వా పార్వతీపురం జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. కరోనా మహమ్మారి తొలివిడత విజృంభించిన సమయంలో గతేడాది పేదలకు నిత్యావసరాలు అందించి వారికి అండగా సిపిఎం ఉందంటూ శ్రీరామ్మూర్తి కొండంత భరోసా ఇచ్చారు. ఇప్పుడు అదే మహమ్మారి బారిన పడి మరణించారు.
ప్రజలతో మమేకమై మాస్‌ లీడర్‌గా ఎదిగిన శ్రీరామ్మూర్తి మృతి పట్ల సిఐటియు రాష్ట్ర కమిటీ నివాళులర్పించింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.నర్సింగరావు, ఎంఎ.గఫూర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామ్మూర్తి అనేక సంవత్సరాలపాటు ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని, కార్మికుల సమస్యల పరిష్కారానికి అనేక ఉద్యమాలు నడిపారని పేర్కొన్నారు. సామాన్య కార్మికులతో, ప్రజలతో కలిసిపోయి పనిచేసే అలవాటు ఉన్న శ్రీరామ్మూర్తి మృతి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.