Sep 14,2021 12:30

ముంబయి :  సినిమాలో పాత్రలు, రెమ్యూనరేషన్‌ల విషయంలో హీరోహీరోయిన్లకు సమాన ప్రాధాన్యత లభించదు. పారితోషకంతో పాటు కథ కూడా హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో తమకు తగిన పారితోషకం కూడా లభించడం లేదంటూ పలువురు హీరోయిన్‌లు బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా 'రామాయణ' పేరుతో తెరకెక్కనున్న ఒక పౌరాణిక కథలో సీత పాత్రలో కరీనా నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ఆమె తన పారితోషికాన్ని రూ.12 కోట్లకు పెంచిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా కోసం కరీనా ఎనిమిది నెలల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనున్నారని అన్నారు. ఈ అంశంపై సోషల్‌మీడియాలో చర్చ జరగడంతో .. ఒక ఇంటర్వ్యూలో కరీనా స్పందించారు. హీరోలతో సమానంగా హీరోయిన్‌లకు పారితోషికం ఇవ్వడం లేదనే అంశం గురించి ఎవరూ మాట్లాడలేదు.. కానీ అలాంటివాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక్కడ పారితోషికం పెంచడం అనేది డిమాండ్‌ చేయడం కాదని... మహిళల గౌరవాన్ని పెంచడమని అన్నారు. కరీనా వ్యాఖ్యలకు తాప్సి, ప్రియమణిలు కూడా మద్దతు తెలిపారు అలౌకిక్‌ దేశారు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో 'రామాయణ' చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం.