Jul 25,2021 09:22

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు పదవీ గండం తప్పేటట్లు కనిపించడం లేదు. తొలుత ముఖ్యమంత్రిగా తాను తప్పుకునేది లేదని చెప్పిన ఆయన తర్వాత అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అనడంతో బిజెపి...కర్ణాటక సర్కార్‌లో మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే యడియూరప్ప స్థానంలో ఎవరినీ భర్తీ చేయాలన్నదే ఇప్పుడు బిజెపి అధిష్టానికి తలనొప్పిగా మారింది. అసమ్మతి నేతలు పుట్టుకు రాకుండా..అందరికీ అయోదయోగ్యమైన నేతను ఎంపిక చేయడం బిజెపికి పెను సవాలుగా మారింది. కన్నడనాట బలమైన లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన యడియూరప్ప స్థానంలో మరొకరిని నియమించే విషయంలో ఇప్పటికే ఓ జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ఎనిమిది మందితో కూడిన జాబితాను షార్ట్‌ లిస్ట్‌ చేశారని తెలుస్తోంది. యడియూరప్ప సామాజిక వర్గానికి చెందిన నేతకే ఇవ్వాలన్నదే బిజెపి భావిస్తోందని విశ్వనీయవర్గాల సమాచారం. అందులోనూ 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదీ ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆదివారమే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
       కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో బిజెపికి మద్దతు నిలుస్తూ వస్తున్నారు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే...రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేష్‌ నిరానీ, ధార్వాడ్‌ ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాద్‌, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్‌, బస్వరాజ్‌ బమ్మరులు. వీరిలో బసన్నగౌడ పాటిల్‌... బిజెపికి మూల స్థంభమైన ఆర్‌ఎస్‌ఎస్‌లో బలమైన మూలాలున్న వ్యక్తి.. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఉత్తర కర్ణాటకలో పేరుమోసిన నాయకుడు. ఆయననైతే ఈ పదవికి సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బిసిలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. మరొకరు అమిత్‌షాకు ఎంతో ఇష్టుడైన మురుగేష్‌ నిరానీకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆయనకు అనేక చక్కర ఫ్ట్యాకరీలున్నాయి. అరవింద్‌ బెల్లాద్‌ ఇంజనీరింగ్‌ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్‌ఇమేజ్‌ ఉంది. ఇక యడియూరప్ప నిర్ణయమైతే....హోంమంత్రి బస్వరాజ్‌ బమ్మరు పేరును సిఫారసు చేసే చాన్సుంది.
      వీరు కాకుండా కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, బిజెపి నేషనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బిఎల్‌ సంతోష్‌, అసెంబ్లీ స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్నారు . కర్ణాటక బిజెపి అధ్యక్షుడు నళిన్‌ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్‌ జోషి...పేరు ఖాయమని వినిపిస్తోంది. కాగా ఈ విషయంపై తనకు ఎటువంటి సమాచారం అధిష్టానం నుండి అందలేదని కేంద్ర బగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ ప్రస్తావించలేదని, కేవలం మీడియా మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయని అన్నారు. . కొత్త సిఎంగా తనను ఎంపికచేస్తారనే విషయాన్ని ఎవరూ తనతో ఇంతవరకూ ప్రస్తావించలేదు' అని మీడియాతో అన్నారు.