May 17,2022 22:24

కృపారాణి

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: రాజ్యసభ సీట్ల కేటాయింపులో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి నిరాశే మిగిలింది. మంగళవారం పార్టీ అధిష్టానం ప్రకటించిన జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నలుగురు పేర్లతో కూడిన జాబితాను ప్రకటించారు. వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బిసి ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్య, బిసి నాయకుడు బీద మస్తాన్‌రావు పేర్లు మాత్రమే ఉన్నాయి. మహిళా కోటాలో ఆమెకు సీటు దక్కుతుందని అంతా భావించారు. సామాజిక సమీకరణాల కూడికలు, తీసివేతల్లో పార్టీ అధిష్టానం ఆమె అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కిల్లి దంపతులు కలిసిన పలు సందర్భాల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థుల పరిశీలన జాబితాలో కృపారాణి పేరొందనే ప్రచారం జరిగింది. అయితే తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో కిల్లి దంపతులు తీవ్ర నిరాశకు గురయినట్లు తెలిసింది. పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులుగా ఇటీవల కాలం వరకు పనిచేశారు. కేబినెట్‌ పునర్వవస్థీకరణ తర్వాత తాజా మాజీ మంత్రులకు జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంతో జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు పార్టీ పగ్గాలు అప్పగించారు. ప్రస్తుతం ఆ పదవి లేకపోవడంతో సామాన్య కార్యకర్తగానే మిగిలిపోయారు. రాజ్యసభ సీటు దక్కితే తగినంత గౌరవం, గుర్తింపు వస్తాయని భావించిన కృపారాణికి జాబితా వార్త విని తీవ్ర నిరాశకు లోనయిట్లు తెలిసింది. రాజ్యసభ సీటు దక్కని నేపథ్యంలో రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్‌ ఏవిధంగా న్యాయం చేస్తారో వేచి చూడాల్సి ఉంది.