Feb 06,2023 21:28

సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ ఆనంద్‌

కలెక్టరేట్‌: మండల అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు ఎక్కువగా చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. పర్యవేక్షణ చేయడం వల్ల పనులు వేగవంతమవుతాయని చెప్పారు. మండల అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో 200 టవర్ల నిర్మాణానికి వెంటనే స్థలాలను గుర్తించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రీ సర్వేలో అందరూ ఫారం-8 జనరేట్‌ చేయాలని సూచించారు. పాలకొండ, బలిజిపేట, సీతానగరం, మక్కువ మండలాల్లో పట్టాల పంపిణీ జాప్యం జరుగుతోందని, త్వరితగతిన చేయాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాల ప్రగతిలో సీతానగరం, కొమరాడ మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. ఇది సరైన సమయమని, లబ్దిదారులను సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. సాలూరు, పాలకొండ పట్టణ గృహ నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఉపాధి హామీ చట్టం కింద 1.50 కోట్ల పని దినాలు కల్పించాలని లక్ష్యమని, అందుకు తగిన విధంగా పనులు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. అమత్‌ సరోవర్‌ పనులు చేపట్టాలని దానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కనీస వేతనం రూ.200 రావాలని, అందుకు వేతనదారులు పనులు చేయుటకు కొలతలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌ మాట్లాడుతూ నాడు నేడు పనులపై ఎంపిడిఒలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ డాక్టర్‌ ఎంవిఆర్‌ కృష్ణాజీ మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన పనులను చేపట్టడం, వాటి బిల్లులు అప్‌ లోడ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్‌ఒ జె.వెంకటరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ జె.శాంతీశ్వర రావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ ఒ.ప్రభాకర రావు, ఇన్‌ఛార్జి డిఇఒ పి.బ్రహ్మాజీ రావు తదితరులు పాల్గొన్నారు.