Mar 24,2023 23:36
బాపట్లలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందజేస్తోందని, క్రమం తప్పకుండా వైద్యం చేయించుకుని క్షయ వ్యాధిని నివారించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ టి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి టి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో క్షయ వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై నినాదాలతో పట్టణంలో ఎన్జీవో హౌం వరకు ర్యాలీ కొన సాగింది. ఈ సందర్భంగా ఎన్జీవో హౌంలో జరిగిన వైద్య ఆరోగ్య సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు, ఆశా కార్యకర్తలను ఉద్దేశించి డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్షయ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని అన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా క్షయ, కుష్టు నివారణ అధికారి డాక్టర్‌ రమాదేవి, వైద్యాధికారులు సాదిక్‌, ఉమాలక్ష్మి, మౌనిక, లక్ష్మి, భార్గవి, కృష్ణ, సుశీల నర్సింగ్‌ విద్యార్థులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కారంచేడు: మార్చి 24 ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు కారంచేడు మండలం స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీ హాష్మ ప్రియ మాట్లాడుతూ క్షయ అనేది అంటువ్యాధి అని రెండు వారాల నుంచి దగ్గు, జ్వరం బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకొని సరియైన సమయంలో మందులు వాడడం ద్వారా టీబీ వ్యాధి పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. ప్రజలు అందరూ క్షయ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ల్యాబ్‌ టెక్నీషియన్‌ భయ్యా శంకర్‌ స్టాఫ్‌ నర్స్‌ మల్లేశ్వరి, ఎంఎల్‌హెచ్‌ పి అశ్వని, ఫార్మసిస్ట్‌ జోత్స్న, ఏఎన్‌ఎంలు నాగలక్ష్మి సౌజన్య, ఆశ వర్కర్లు పద్మ, ఎఫ్‌ఎన్‌ఓ శోభ పాల్గొన్నారు.
భట్టిప్రోలు: క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి దాని నివారణకు చర్యలు చేపట్టాలని వెల్లటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సిహెచ్‌ రామలక్ష్మి సూచించారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం భట్టిప్రోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపిపి డివి లలితకుమారి, జెడ్పిటిసి టి ఉదరు భాస్కరిలు ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం నుంచి రైల్వే గేటు వరకు కొనసాగింది. క్షయ వ్యాధిని నివారించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని నినదించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌లు, అంగన్‌వాడీలు, ఆశలు, వైద్య సిబ్బంది ఉన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. వైద్యులు పద్మజ, సూపర్‌వైజర్‌ మాతయ్య, అంగన్‌వాడీ, ఆశలు పాల్గొన్నారు.