Mar 25,2023 00:12

నరసరావుపేటలో ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం

ప్రజాశక్తి-నరసరావుపేట : క్షయ ప్రమాదకరమైన వ్యాధే అయినా పూర్తి చికిత్స అందుబాటులో ఉందని, మందులను ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుందని పల్నాడు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి (డిఎం అండ్‌ హెచ్‌ఒ) డాక్టర్‌ జి.శోభారాణి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని స్థానిక పల్నాడు రోడ్డులోని పాత ఏరియా ఆస్పత్రి వద్ద జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ పద్మావతి అధ్యక్షత వహించగా జిల్లా వైద్యాధికారి శోభారాణి మాట్లాడారు. జిల్లాలోని ప్రతి పిఎసి, పిహెచ్‌సిలో ఆర్‌టిపిసిఆర్‌, సిబిఎన్‌ఎఎటి కిట్లు, డిఎంసిలు అందుబాటులో ఉన్నాయన్నారు. 15 రోజులుగా దగ్గు జలుబు, కళ్లెలో రక్త పడడం, ఛాతిలో మార్పు, బరువు తగ్గుటం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సలహా మేరకు చికిత్స పొందాలని సూచించారు. క్షయ పీడితులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.500 ఆర్థిక సాయం ఇస్తునందని చెప్పారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత అభియాన్‌ కార్యక్రమం కింద జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని 1234 మంది దాతలు ద్వారా 1781 మంది టీబీ పీడితులను దత్తత తీసుకొని ప్రతినెలా క్షయ మిత్ర కార్యక్రమం ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. క్షయ వ్యాధి గ్రస్తులను ఇతరులు చులకనగా చూడొద్దని, వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ప్రజాశక్తి - వినుకొండ : పట్టణంలోని 1వ వార్డు బాలిక హైస్కూలు విద్యార్థినులు, ఆస్పత్రి సిబ్బంది అవగాహనా ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుండి స్తూపం సెంటర్‌ వరకూ ప్రదర్శనగా సాగింది. అనంతరం వైద్యశాల ఆవరణలో విద్యార్థినులు మానవహారంగా ఏర్పడ్డారు. క్షయ లక్షణాలు, నియంత్రణపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.బుచ్చిబాబు వివరించారు. డాక్టర్‌ రజాక్‌, డాక్టర్‌ నరేష్‌, సిబ్బంది సుభాని, రాజేశ్వరరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్‌ : క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సులువని డాక్టర్‌ నాగపద్మజ అన్నారు. జాతీయ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఏరియా వైద్యశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ నాగపద్మజ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గుతో బాధపడుతూ ఉంటే తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. రోగాన్ని ప్రథమ దశలోనే గుర్తిస్తే మందుల వాడకంతో పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవచ్చని వివరించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ క్షయ పీడితులకు ప్రతినెలా రూ.700 పౌష్టికాహార కిట్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్‌ మహబూబ్‌ నిష, స్టాలిన్‌, ఇబ్రహీం పాల్గొన్నారు.