
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : క్షయ వ్యాధిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినంలో భాగంగా నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దగ్గు క్రమం తప్పకుండా రెండు వారాల వరకు ఉంటే దగ్గరలోని ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందుల వాడకం ప్రారంభించాలని తెలిపారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల కోసం సమర్థవంతమైన చికిత్స అందించేందుకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. మందులను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు. మందులు వాడితే ఆరు నెలల్లో తగ్గిపోతుందన్నారు.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి మాట్లాడుతూ క్షయ అంటువ్యాధి అని, ట్యూబర్‌క్లోసిస్ అనే మైక్రో బ్యాక్టీరియా ద్వారా ఇది సంక్రమిస్తుందన్నారు. ఈ బ్యాక్టీరియాను రాబర్ట్‌కాక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడడం, ఛాతినొప్పి, సాయంకాలం జ్వరం, రాత్రి నిద్రలో చెమట పట్టడం క్షయ రోగి లక్షణాలని వివరించారు. జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి అనురాధ మాట్లాడుతూ క్షయ నివారణలో 2020 నుంచి 2022 వరకు వరుసగా మూడేళ్లు జిల్లా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుందని తెలిపారు. ర్యాలీకి ముందు రాబర్ట్‌కాక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం రెడ్‌క్రాస్ ద్వారా 600 మందికి పోషకాహార కిట్లు, న్యూ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యాన ర్యంలో క్షయ వ్యాధితో చికిత్స పొందుతున్న వారికి న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు, అర్బన్ పిహెచ్‌సి వైద్యాధికారి జె.కృష్ణమోహన్, డిపిఆర్‌ఒ కె.బాలమాన్‌సింగ్, డెమో వెంకటరమణ, పల్మనాలజిస్టు ప్రదీపిక, తిరుపతిరావు, రెడ్డీస్ ల్యాబ్ ఫౌండేషన్ సమన్వయకర్త జి.సురేష్, అరబిందో ప్రతినిధి తదితరులకు జ్ఞాపికలు అందజేశారు. వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.