Jul 21,2021 21:10

* ఒలింపిక్స్‌ ఆర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌
చెన్నై :
రాణీ రుద్రమ దేవి, ఝాన్సీ రాణీ వంటివారి గురించి చదువుతున్నప్పుడో.. లేదా చారిత్రక సినిమాలు చూస్తున్నప్పుడో మనం ఆడవాళ్ల కత్తి విద్య ప్రావీణ్యాన్నికి మనం అబ్బురపడుతుంటాం. అయితే ఈ కత్తిసాములో మనదేశానికి చెందిన ఒక అమ్మాయి ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపడాన్ని మనం ఊహించి ఉండం. కానీ ఇలాంటి ఒక ఊహను 26 ఏళ్ల భవానీ దేవి ప్రస్తుతం నిజం చేసింది. తమిళనాడుకు చెందిన సిఎ భవానీ దేవి టోక్యో ఒలింపిక్స్‌కు ఆర్హత సాధించి, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా రికార్డులకెక్కింది.

కత్తిసాముపై కోటి ఆశలు.. టోక్యోలో పతకంపై భవానీ దేవి గురి

తొండియార్‌పేట్‌లోని మురుగా ధన్షుకోటి బాలికల హైయర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నప్పుడు సరదాగా ఫెన్సింగ్‌ క్రీడాను ఎంచుకున్నా.. ప్రస్తుతం మాత్రం ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా విదేశాల్లో శిక్షణ తీసుకుంటుంది. ఎంబిఎ చదివిన భవానీకి ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. తల్లి రమణి గృహిణికాగా, తండ్రి సి అనంద సుందరరమణ పురోహితుడు. తండ్రికి ఐదుగురి పిల్లల్ని చదివించడమే కష్టంగా ఉన్న సమయంలో భవానీ అత్యంత ఖరీదైన క్రీడను ఎంచుకుంది. ఇలాంటి సమయంలో బెంగళూరుకు చెందిన గోస్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ భవానీకి సహాయం చేయడానికి ముందకు వచ్చింది. అలాగే, 2016లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన క్రీడాకారులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకానికి కూడా భవాని ఎంపికయింది. జాతీయ స్థాయి వరకూ సారులో శిక్షణ తీసుకున్నా ప్రస్తుతం ఆమె ఇటలీలో శిక్షణ తీసుకుంటుంది. 17 ఏళ్ల తీవ్ర కష్టంతోనే ఒలింపిక్స్‌కు భవానీ ఎంపికయిందని తల్లి రమణి చెబుతోంది. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వమున్న భవానీ ఖచ్చితంగా ఒలింపిక్‌ పతకం సాధిస్తుందని రమణీ నమ్మకంగా ఉంది. ఈ నమ్మకం నిజమవ్వాలని కోరుకుందాం.

కత్తిసాముపై కోటి ఆశలు.. టోక్యోలో పతకంపై భవానీ దేవి గురి