
ప్రజాశక్తి-రేపల్లె: దేశంలో కుల, మత ఆధిపత్య భావజాల వ్యాప్తి జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర, లౌకిక వాదులపై ఉందని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి మంగరాజు అన్నారు. పోరాటాల పురిటిగడ్డ అయిన బాపట్ల జిల్లా రేపల్లెలోని మైనేని సీతారామయ్య కళ్యాణ మండపంలో ప్రజానాట్యమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన సౌహార్ధ్ర సందేశాన్ని ఇచ్చారు. మతోన్మాద శక్తులు సాంస్కతిక రంగాన్ని తమ గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నాలను తీవ్రం చేశాయన్నారు. నూతన ఆర్థిక విధానాల కారణంగా వస్తున్న ప్రజా సమస్యలపై ప్రజా కళలు పోరాడుతున్నాయన్నారు. ప్రజా కళలు వ్యాప్తి చెందకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. దానిలో భాగంగానే అభ్యుదయ సాహిత్యానికి, కళాకారులకు నిలయంగా ఉన్న కళా సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రకు బీజేపీ పూనుకున్నదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజానాట్యమండలి కర్తవ్యం మరింత పెరిగిందనీ, ప్రజా నాట్యమండలి కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. సాంస్కతిక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, సమస్యల ఇతివృత్తంగా ప్రజా కళారూపాలను రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్లాడానికి కృషి మరింత జరగాలని ఆకాంక్షించారు. కళాకారుల్లో నైపుణ్యాలు పెంపొందించేం దుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమకాలీన రాజకీయ అంశాలపై నూతన రచనలు తీసుకు వచ్చి విశాల, ప్రత్యామ్నాయ సాంస్కతిక ఉద్యమానికి అడు గులు పడాలని ఆకాంక్షించారు. 'ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం మాట్లాడుతూ దేశవ్యాపితం గా మత విద్వేషాలు, మూఢత్వం వికటాట్టహాసాలు ఇక్కడా వినిపిస్తున్నాయని అన్నారు. భావస్వేచ్ఛపైన, రచయితలు, పాత్రికేయులపైన దేశవ్యాపితంగా వేటసాగుతోంది. విద్యార్థులను, యువతను ముందుకు రానీయకుండా, ప్రశ్నించేతత్వాన్ని అలవరచకుండా మోదీ సర్కారు అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు. దేశంలో సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతమైన మార్పు విద్యార్థులు, యువతతోనే సాధ్యమన్నారు. అటువంటి మార్పు వెంటనే ప్రారంభం కావాలన్నారు. నేటి నుంచి సర్ అనే పదాన్ని వదలివేసి కామ్రేడ్ అని ప్రతి ఒక్కరినీ సంబోధించాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో యువతకు ఉపాధి కరువైందని విమర్శించారు. నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీని బీజేపీ విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టడమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందన్నారు. మోదీ సర్కారుపై తిరుగుబాటుకు సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రానున్న కాలంలో గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
'ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు సాంస్కతిక రంగం గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వం గత రెండు రోజులుగా బడ్జెట్ ప్రకటించింది సాంస్కతిక రంగం గురించి బడ్జెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరం. కవులు, కళాకారులపై దాడులు జరుగుతున్నాయని, సాహిత్యం మీద ఆంక్షలు విధించే విధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వివిధ కళారూపాలు రూపొందించాలన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపడానికి కలలను ఆయుధంగా మలుచుకుని పనిచేయాలన్నారు. సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేసినందుకు సమస్యల ఇతివృత్తంగా ప్రజా కళారూపాలను రూపొందించి ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి మరింత కృషి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్, భవన నిర్మాణ సంఘం జిల్లా కార్యదర్శి జొన్నలగడ్డ ధర్మరాజు, రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు, ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు.