Jul 22,2021 06:54

వసుదేవుడు అంతటి వాడు అవసరార్ధం గాడిద కాళ్లు పట్టుకున్నాడన్న కథ తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో అధికారం కోసం ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ వివిధ కులాలవారీగా సంతృప్తిపరిచేందుకు పాట్లు పడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నెలలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఆ రాష్ట్ర అధికారం కోసం రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో తెలియదు. ఉత్తర ప్రదేశ్‌లో సంఖ్య రీత్యా రెండున్నర కోట్ల మంది వరకు బ్రాహ్మణులు వుంటారని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు అంటే పూజా పునస్కారాలు, ఇతర క్రతువులు నిర్వహించేవారిగా మాత్రమే తెలుసు. ఉత్తరాదిన వారు వీటితో పాటు వ్యవసాయం చేస్తారు. వీరిలో కూడా శాఖా బేధాలు, ఎక్కువ తక్కువ నిచ్చెనమెట్లు వున్నాయి. కొందరిని కొందరు బ్రాహ్మణులుగా గుర్తించని వంటి అంశాలూ వున్నాయి. మనువాదానికి ప్రతీకగా బ్రాహ్మణులను చూస్తున్నప్పటికీ అందరినీ ఆ గాటన కట్టలేము. ఇటీవలి బిజెపి చర్యలను చూసినపుడు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా ఉన్న ఈ సామాజిక తరగతిని సంతృప్తిపరిచేందుకు ఎంతకైనా తెగిస్తుందని తేలిపోయింది.

మనువాద వ్యతిరేక భావజాల ప్రాతిపదికన ఏర్పడిన బహుజన సమాజవాది పార్టీ అధినేత్రి మాయావతి మరోసారి ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణ సంతుష్టపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. తొలిసారి 2007లో ఆమెకు అధికారం రావటంలో వారి మద్దతు ప్రధాన పాత్ర పోషించింది. దేశమంతటా దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక బలహీనవర్గాల మీద దాడులు, అత్యాచారాల గురించి పార్టీలు చెప్పటం సాధారణ విషయం. కానీ దానికి భిన్నంగా ఉత్తర ప్రదేశ్‌లో బ్రాహ్మణుల మీద అవి జరుగుతున్నాయని మాయావతి చెప్పటమే గమనించాల్సిన అంశం. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు తగ్గిందేమీ లేదని, తక్కువ వున్నట్లు చూపేందుకు నమోదు చేయవద్దని పోలీసు శాఖను అదేశించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాను అధికారాన్ని చేపట్టిన తరువాత బ్రాహ్మణుల గౌరవం, ప్రయోజనాలను కాపాడతానని ఇటీవల ఆమె ప్రకటించారు. జూలై 23న అయోధ్యలో పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర మిశ్రా బ్రాహ్మణ మేలుకొలుపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 2017లో బ్రాహ్మణ ఓటర్ల మద్దతు పొంది అధికారానికి వచ్చిన బిజెపి వారి సంక్షేమానికి పాల్పడకుండా వేధించిందని, వారిని దోచుకుందని, బిజెపి కి మద్దతు ఇచ్చినందుకు వారు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారని మాయావతి చెప్పుకొచ్చారు.

మాయావతి 2007 నుంచి 2012 వరకు అధికారంలో వున్న సమయంలో సంతృప్తిపరిచే రాజకీయాలకు పాల్పడ్డారని, అగ్రకులాల వారిని పక్కన పెట్టి ఇప్పుడు ఎన్నికల కారణంగా బ్రాహ్మణులను ఆకర్షించేందుకు పూనుకున్నారని బిజెపి ప్రతినిధి రాకేష్‌ త్రిపాఠీ విమర్శించారు. మద్దతు తగ్గిపోతున్న కారణంగా మాయావతి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, తాము అన్ని కులాల వారి సంక్షేమానికి కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రతినిధి నసీముద్దీన్‌ సిద్దికీ, తాము అన్ని కులావారినీ సమంగా చూస్తామని, మాయావతి ప్రతిపక్షాల మీద చేస్తున్న దాడిని చూస్తే బిజెపి తో లోపాయికారీ ఒప్పందం ఉందన్నది వెల్లడైందని సమాజవాది పార్టీ ప్రతినిధి అబ్దుల్‌ హఫీజ్‌ గాంధీ అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో సామాజిక సమీకరణాలను చూసినపుడు బ్రాహ్మణులు సంఖ్యరీత్యా ఎక్కువ కానప్పటికీ విజయావకాశాలను ప్రభావితం చేసే స్ధితిలో ఉన్నారు. గత మూడు దశాబ్దాలలో మొత్తంగా బ్రాహ్మణులు బిజెపి తోనే ఉన్నారు. అయితే రాజపుత్రుల ప్రాబల్యం ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో పెరిగిపోయి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. వికాస్‌ దూబే అనే గూండా నేతను, ఐదుగురు సహచరులను పోలీసులు కాల్చి చంపారు. ఆ ఉదంతంలో దూబే గ్యాంగు చేతిలో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. దూబే ఉదంతాన్ని చూపి బ్రాహ్మణ వ్యతిరేక చర్యగా చిత్రించే ప్రయత్నం ఆ సమయంలో జరిగింది. నిజానికి అది కులపరంగా జరిగిన ఉదంతం కాదు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని బిజెపి అనుకుంటోంది. అందుకే ప్రముఖ బ్రాహ్మణ నేతగా పేరున్న జితిన్‌ ప్రసాదను ఇటీవల కాంగ్రెస్‌ నుంచి ఆకర్షించింది. బ్రాహ్మణ చేతన పరిషత్‌ పేరుతో ప్రసాద ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌ అధికారి ఎ.కె శర్మను ఉద్యోగానికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాదు, ఎంఎల్‌సి పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చు కోవాలన్న అధిష్టాన వర్గ ఆదేశాన్ని యోగి ఖాతరు చేయలేదు. ఆయనను ఎంఎల్‌సి చేసి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. శర్మను కలుసు కొనేందుకు యోగి నిరాకరించారని కూడా వార్తలు వచ్చాయి. ఆర్థికంగా బలహీనవర్గాలకు పదిశాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందున వారే ఎక్కువ లబ్ధి పొందుతారని ప్రచారం చేసింది. తాము పరశురాముడి అంశకు చెందిన వారమని బ్రాహ్మణులు భావిస్తున్న కారణంగానే తాము అధికారానికి వస్తే భారీ పరుశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిఎస్‌పి, సమాజవాది పార్టీ ప్రకటించాయి.

బ్రాహ్మణులను సంతృప్తిపరచేందుకు రాహుల్‌ గాంధీ కూడా ప్రయత్నించారు. తాను కౌల్‌ బ్రాహ్మణ పూర్వీకుల వారసుడనని, తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పుకున్నారు. గతంలో బ్రాహ్మణులు కాంగ్రెస్‌కు తిరుగులేని మద్దతుదారులుగా ఉండేవారు. బిఎస్‌పి పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ బ్రాహ్మణ సామాజిక తరగతికి చెందిన వారినే ఇప్పుడు నాయకులుగా నియమించారు. మాయావతి మంత్రివర్గంలో గరిష్ట స్ధాయిలో వారున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గరిష్ట సంఖ్యలో అభ్యర్ధులుగా వారిని నిలిపారు.
ఉత్తర ప్రదేశ్‌ ఇప్పుడు కులాలు, మతాల రాజకీయం నడుస్తోంది. బిజెపి 'హిందూత్వ' తన గుత్త సొమ్మని భావిస్తోంది. మాకూ వాటా ఉందని మేమూ హిందూత్వ శక్తులమే అని ఓటర్ల ముందు నాలుగు ప్రధాన పార్టీలూ ఓట్ల జోలె పట్టుకొని నిలుచోబోతున్నాయి. ఆయోధ్య రామ మందిరాన్ని చూపి ఓట్లడిగేందుకు బిజెపి పూనుకుంటే బిఎస్‌పి అక్కడే తన బ్రాహ్మణ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టబోతున్నది. శ్రీరాముడి దర్శనం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తరువాత మిగతా దేవుళ్ల పట్టణాల్లో సభలు జరుపుతారు. ప్రతిచోటా దేవుడి దర్శనంతోనే ప్రారంభం. గత ఎన్నికల్లో బిజెపి కి ఓట్లు వేసిన వారిలో అగ్రకులాల వారే కాదు, దళితులు కూడా గణనీయంగా మొగ్గారు. అందువలన వారి హిందూత్వను సంతృప్తి పరచేందుకు బిఎస్‌పి ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో చూడాల్సి ఉంది. గుళ్లు, గోపురాలను సందర్శించి తామూ హిందువులమే అనిపించుకునేందుకు ఎస్‌పి, కాంగ్రెస్‌ నేతలు బారులు తీరుతున్నారు. స్ధానిక మనోభావాలను అర్ధం చేసుకోవాలని ఎవరికి వారు సమర్ధించుకుంటున్నారు. అందరూ తమకు పోటీ వస్తున్నందున మత కిక్కు ఎక్కించేందుకు బిజెపి ఏం చేయనుందో చూద్దాం!

సత్య