Mar 02,2021 18:47

న్యూఢిల్లీ : 46 రోజుల కస్టడీ అనంతరం ఇటీవల బెయిల్‌పై విడుదలైన కార్మిక హక్కుల కార్యకర్త నౌదీప్‌కౌర్‌ అరెస్ట్‌ అనంతరం కస్టడీలో తనపై జరిగిన వేధింపుల గురించి వివరించారు. కులం పేరుతో దూషించారని, డ్రైనేజీ పనులు చేసుకునే వారికి ఉద్యమాలు అవసరమా అంటూ వ్యాఖ్యానించారని అన్నారు. భౌతికంగా తనపై దాడులకు కూడా పాల్పడ్డారని చెప్పారు. జైలులో మహిళా ఖైదీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు. తనను చాలా హింసించారని, తాను దళిత యువతిని అయినందుకే నాపై హింసకు కూడా పాల్పడ్డారని అన్నారు. దళితులు డ్రైనేజీ తీసేవారు. నువ్వు కూడా అదే పని చేయాలి. ప్రజల్ని ఏకం చేయడం, ఉద్యమాలు చేయడం నువ్వెందుకు చేస్తున్నావు?' అంటూ తనను పోలీసులు ప్రశ్నించారని అన్నారు. అసభ్యకరంగా తిట్టారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకు వెళ్లారని అన్నారు. భయంకరంగా గంటల తరబడి కొట్టారని, ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తగా దళిత యువతిగా తాను ఈ హింసను ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. తాను దళిత యువతిని కాకపోతే ఇంతగా హింసను ఎదుర్కొని ఉండేదాన్ని కాదని చెప్పారు. జైలులో ఉన్న మహిళా ఖైదీల గురించి మాట్లాడుతూ.. జైల్లో మహిళా ఖైదీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. తనపై జరిగిన దాడి గురించి జైలులో ఉన్న మహిళలకు చెప్పినప్పుడు వాళ్లు స్పందించలేదని అన్నారు. ఎందుకంటే తనపై జరిగిన దాడి గురించి వారు ఒక అంచనాలో ఉండి ఉంటారని.. ఇటువంటి పరిస్థితులను తరుచూ వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాను కస్టడీలో ఉన్న జైలులో సుమారు 200 మంది మహిళా ఖైదీలు ఉంటారని, చిన్న చిన్న కేసుల కారణంగా వారంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. జైలులో ఉన్న మహిళలంతా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారేనని నౌదీప్‌ అన్నారు. పంజాబ్‌-హర్యానా హైకోర్టు ఆమెకు బెయిల్‌ ఇవ్వడంతో 46 రోజుల అనంతర కస్టడీ నుంచి ఫిబ్రవరి 26న నౌదీప్‌ కౌర్‌ జైలు నుండి విడుదలయ్యారు. హర్యానాలోని కుండలీ ఇండిస్టియల్‌ ఏరియాలో వేతన బకాయిల కోసం పోరాడుతున్న కార్మికులతో కలిసి నిరసన ప్రదర్శనలు చేస్తున్న నౌదీప్‌ కౌర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నౌదీప్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమెను విడుదల చేయాలంటూ అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికా ఉపాధ్యక్షులు కమలా హారిస్‌ మేనకోడలు మీనా హారిస్‌ కూడా ట్విటర్‌లో స్పందించారు.