Sep 27,2021 01:45

ఓడ్డుకు చేరిన బోట్లు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
గులాబ్‌ తుపాను ప్రభావంతో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి నుంచి స్వల్పగాలులతో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. రోడ్లపై నీరు పారింది. జిల్లాలో ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఆరు గంటలకు 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా కొయ్యూరులో 178.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యల్పంగా అనంతగిరిలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ముంచంగిపుట్‌లో 16.2, పెదబయలులో 25.6, హుకుంపేటలో 11.6, డుంబ్రిగుడలో 28.2, అరకులోయలో 40.2, అనంతగిరిలో 1.8, దేవరాపల్లిలో 27.0, చీడికాడలో 31.8, మాడుగులలో 37.6, పాడేరులో 28.4, జి.మాడుగులలో 11.2, చింతపల్లిలో 68.8, జికెవీధిలో 26.8, కొయ్యూరులో 178.2, గొలుగొండలో 95.2, నాతవరంలో 45.6, నర్సీపట్నంలో 108.8, రోలుగుంటలో 76.4, రావికమతంలో 35.6, బుచ్చెయ్యపేటలో 38.6, చోడవరంలో 43.2, కె.కోటపాడులో 17, సబ్బవరంలో 60, పెందుర్తిలో 52.6, ఆనందపురంలో 54.4, పద్మనాభంలో 45.2, భీమునిపట్నంలో 53, విశాఖ అర్బన్‌లో 65.4, విశాఖ రూరల్‌లో 51.8, గాజువాకలో 47.8, పెదగంట్యాడలో 49.8, పరవాడలో 26.2, అనకాపల్లిలో 27.4, మునగపాకలో 39, కశింకోటలో 40, మాకవరపాలెంలో 42.8, కోటవురట్లలో 50.8, పాయకరావుపేటలో 46.8, నక్కపల్లిలో 81.6, ఎస్‌.రాయవరంలో 61, యలమంచిలిలో 47.4, రాంబిల్లిలో 31.8, అచ్యుతాపురంలో 29.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అధికారుల అప్రమత్తం
కలెక్టరేట్‌ : జిల్లాలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు అప్రమత్తం చేశారు. ఆదివారం జిల్లా కలక్టర్‌, జాయింట్‌ కలక్టర్‌, జివిఎంసి కమిషనర్‌, జిల్లా అధికారులలో కలక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. విద్యుత్తు, జివిఎంసి, రెవెన్యూ, ఫైర్‌, పోలీసు, ఆర్‌ అండ్‌ బి,వ ుత్య శాఖల అధికారులు, సిబ్బంది అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా కలక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నగర సిపి, రూరల్‌ ఎస్పీలతో చర్చించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
కోటవురట్ల : గులాబ్‌ తుపాను ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో ఎటువంటి రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు తహశీల్దార్‌ సోమశేఖర్‌ తెలిపారు,
బిహెచ్‌పివి వద్ద విరిగిన చెట్టు
గాజువాక : ఆదివారం కురిసిన వర్షానికి రాత్రి 9 గంటల సమయంలో బిహెచ్‌పివి జంక్షన్‌ వద్ద చెట్టు నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. జివిఎంసి అధికారులు స్పందించి జెసిబి సహాయంతో రోడ్డు మీద పడిన చెట్టును పక్కకు తొలగించారు.
రైల్వే శాఖ హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు
ఎంవిపి కాలనీ : గులాబ్‌ తుపాను హెచ్చరికల దృష్ట్యా రైలు సర్వీసుల కదలిక గురించి ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, రాయగడ స్టేషన్లలో తాత్కాలిక హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలు కావాల్సిన సహాయం పొందాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.