Oct 28,2021 18:05

న్యూఢిల్లీ  :  ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని టిక్రీకి సమీపంలో ముగ్గురు మహిళా రైతులపై నుండి ట్రక్‌ దూసుకెళ్లిన కేసులోని కుట్ర కోణంపై విచారణ చేపట్టాలంటూ రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మరో మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌ మనా జిల్లాలోని ఖైవా డయలువాలా గ్రామానికి చెందిన వీరిని అమర్‌జీత్‌ కౌర్‌ (58), గుర్మెయిల్‌ కౌర్‌ (60), షిండేర్‌ కౌర్‌ (61)లుగా గుర్తించారు. లఖింపూర్‌ ఖేర్‌ జిల్లాలో రైతులపై నుండి వాహనం దూసుకెళ్లిన ఘటన మరువక ముందే హర్యానా సరిహద్దుల్లో ఈ దారుణం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనను ప్రమాదంగా భావిస్తున్నామని.. డ్రైవర్‌ కోసం గాలిస్తున్నామని విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయంటూ ఝజ్జర్‌ ఎస్‌పి వెల్లడించడం గమనార్హం.

నిరసన ప్రాంతం నుండి మహిళలు వారి గ్రామాలకు తిరిగి  వెళుతుండగా ఈ విషాదం జరిగిందని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (ఎక్తా ఉగ్రహాన్‌-బికెయు) నేత బసంత్‌ కోతా గురు పేర్కొన్నారు. ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ ఆ మహిళలు నిరసనలో పాల్గొనేందుకు వస్తున్నారని.. ఉద్యమంలో వారి లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనక ఏమైనా కుట్ర ఉందేమోనన్న కోణంలో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.పదిలక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నట్లు బికెయు రాష్ట్ర కార్యదర్శి షింగారా సింగ్‌ మను తెలిపారు. ఈ కేసులో న్యాయం జరగాలంటూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) డిమాండ్‌ చేసింది.