Oct 17,2020 21:45

ఉండేందుకు సొంతిల్లున్నా... ఇంట్లో ఖరీదైన వస్తువులున్నా... ఆ కుటుంబం ఆనందంగా జీవితాల్ని పంచుకోలేని పరిస్థితి! అందుకు కారణం.. ఆ ఊరిలో ప్రతి వీధి నుంచి ఐదారుగురు ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్తుంటారు. సొంత వారిని, ఊరిని విడిచిన వారు తిరిగి తమ సొంత గూటికి చేరేందుకు నానా అవస్థలు పడుతుంటారు. ఆ వలస బతుకుల వెతల కథను తెలుసుకుందామా?

తూర్పు గోదావరి జిల్లా మలికిపురంలో నివాసం ఉంటోంది శ్రీ విద్య (23). ఇంటర్‌తో చదువు ఆపేసి, కుటుంబానికి సాయంగా పొలం పనులకు వెళ్లేది. ఏడాదిలోపే అదే ఊళ్లో ఉన్న చంద్రశేఖర్‌ (28)తో పెద్దలు పెళ్లి చేశారు. అతడికి ముగ్గురు చెల్లెళ్లు. ఐటిఐ చదివిన చంద్రశేఖర్‌ దుబాయ్‌ వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశం రాలేదు. భార్య భర్త ఇద్దరూ పొలం పనులకు వెళ్లేవారు. పెళ్లైన ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత చూడాలంటే - వస్తున్న సంపాదన సరిపోదు. తనకేమో దుబాయ్‌ వెళ్లే అవకాశం రావటం లేదు. ఈ నేపధ్యంలో 'హౌస్‌ మెయిడ్‌'గా పనిచేసే అవకాశం రావడంతో- పాప పుట్టిన పది నెలలకే శ్రీ విద్య దుబాయ్‌ వెళ్లింది. అప్పటివరకూ ఆమె ఆ ఊరు పొలిమేర దాటి ఎరగదు. కుటుంబ అవసరాల రీత్యా ఒక్కసారిగా దేశాన్ని దాటాల్సి వచ్చింది. పది నెలల పసికందును కుటుంబ సభ్యుల వద్ద వొదిలి తప్పని పరిస్థితుల్లో దుబాయ్‌ వెళ్లింది.

మధ్యవర్తి ద్వారా ఉద్యోగంలో చేరింది. వర్కు అగ్రిమెంటులో ఏముందో ఎవరూ తెలుసుకోలేదు. శ్రీవిద్య వెళ్లినప్పటినుంచి ప్రతి నెల ఆ ఏజెన్సీ వారే జీతాన్ని ఇంటికి పంపిస్తారు. అయితే, ఆమెతో కుటుంబ సభ్యులు తరచూ మాట్లాడ్డం వీలవదు. ఏ ఆర్నెల్లకో, పదినెలలకో మాత్రమే మాట్లాడే అవకాశం దక్కుతుంది. అది కూడా ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని ఎదురుగా.. కేటాయించిన సమయంలోనే మాట్లాడాలి. కనీసం ఉత్తర ప్రత్యుత్తరాలకూ అవకాశం లేదు. దుబాయ్‌లోని ఆమె ఉండే అడ్రసు కూడా వారికి తెలియదు. పదినెలలప్పుడు చూసిన తన కూతుర్ని ఇప్పటివరకూ చూడలేకపోతున్నానని శ్రీవిద్య ఫోన్‌లో బాధపడుతుంది. మూడేళ్లు గడిచాయి. ఆమెను వీడియో కాల్‌ ద్వారా అమెను చూడాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సెలవుపై రావడం అవుతుందేమోనని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ, అదీ జరగలేదు. మధ్యవర్తిని అడిగితే, ఆరేళ్లకు ఎగ్రిమెంటు జరిగిందని, శ్రీ విద్య పనిచేస్తున్న ఇంటి యజమాని అనుమతి లేనిదే తామేం చెయ్యలేనని ఏజెంటు తేల్చి చెప్పేశాడు. శ్రీవిద్య పంపిన డబ్బుతో చంద్రశేఖర్‌ ఇద్దరి చెల్లెళ్ల పెళ్లిళ్లు జరిపాడు. కుటుంబ పరిస్థితి కాస్త మెరుగు పడింది. కానీ, శ్రీ విద్య అక్కడ చిక్కుకుపోయింది. నోరారా అమ్మా.. అని కూతురి పిలుపు వినేందుకూ తన భార్య నోచుకోలేదని చంద్రశేఖర్‌ బాధ పడుతున్నాడు.

రెండు నెలల క్రితం కరోనా సోకి చంద్రశేఖర్‌ తల్లి మరణించింది. ఈ వార్త శ్రీవిద్యకు చేరడానికే 20 రోజులు పైనే పట్టింది. గత నెల చంద్రశేఖర్‌కి యాక్సిడెంటు అయ్యి కాలు విరగడంతో, ఆర్నెల్ల పాటు నడవకూడదని వైద్యులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో చందశ్రేఖర్‌ తన కూతుర్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నందుకు బాధపడుతున్నాడు. 'ఉపాధి కోసం వెళ్లిన నా భార్య మరో దేశంలో ఎలా ఉందో తెలియదు. ఈ పరిస్థితి చాలా దుర్బరంగా ఉంది.' అని వాపోతున్నాడు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి శ్రీ విద్యను తిరిగి స్వస్థలానికి పంపాలని మధ్యవర్తి ద్వారా కోరారు. అగ్రిమెంటు మరో ఆరేళ్లు ఉందని, అప్పటివరకూ ఆమెను పంపడానికి కుదరదని సమాధానం వచ్చింది. ఈ ఆరేళ్ల సంగతి తమకు ముందు చెప్పలేదని చంద్రశేఖర్‌ వాపోతున్నాడు. స్థానిక నాయకులకు ఈ విషయం వివరించి, తన భార్యను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలని కోరాడు.

ఇతర దేశాల నుంచి 'హౌజ్‌ మెయిడ్స్‌'గా వెళ్లిన తర్వాత వారికి ఆ దేశపు చట్టాలే అమలవుతాయని, అగ్రిమెంట్‌ పూర్తయ్యేవరకూ రప్పించటం సాధ్యం కాదని పలువురు చెబుతున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే తప్ప ఇంటికి పంపరని అంటోంది దుబారులో 'హౌజ్‌ మెయిడ్‌'గా పనిచేసి వచ్చిన చంద్రమ్మ (62). అదే ఊళ్లో నివాసం ఉంటోన్న చంద్రమ్మ చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. దాంతో, కుటుంబ పోషణ నిమిత్తం 28 ఏళ్లప్పుడు దుబాయ్‌ వెళ్లిన చంద్రమ్మ... 18 ఏళ్లపాటు అక్కడే పని చేసింది. తన ఇద్దరి కొడుకుల వివాహాలను దగ్గరుండి చూడలేకపోయింది. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో... సొంతూరు పంపారు. పంపేటప్పుడు కొంత డబ్బు ఇచ్చారు. వెళ్లినవాళ్లెవరైనా తమంతట తాము రావాలనుకున్నప్పుడు తిరిగి రాలేరని ఆమె అంటోంది.
కొందరైతే, మధ్యవర్తిని నమ్మి చెప్పిన ఉద్యోగానికి బదులుగా వేరే పని చేసేవాళ్లూ ఉన్నారు. దుబాయ్‌ వెళ్లిన వారు వెంటనే తిరిగి రాలేక, కారు డ్రైవర్లుగా, హాస్పిటళ్లలో ఆయాలుగా పనిచేసుకుంటూ కాలం గడుపుతారు. కొందరైతే తగిన విద్యార్హతతో హాస్పిటల్లో నర్సులుగా చేరి ఇరవై ఏళ్లకు పైగా పనిచేసేవారున్నారు. వారికి మంచి జీతం వస్తుండటంతో ఎక్కువ కాలం అక్కడే ఉంటూ డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత తిరిగి తమ సొంతూరికి వస్తున్నారు.

గోదావరి జిల్లాల్లోని కోనసీమ, డెల్టా ప్రాంతాల్లోని చాలా ఊళ్ల నుంచి దుబాయ్‌ వంటి దేశాలకు ఇలా చాలామంది వెళుతున్నారు. మగవారి కన్నా కూడా ఇంటి పనివారిగా వెళ్లే అవకాశం మహిళలకు ఉంది. దీంతో చాలామంది భర్తను, పిల్లలను వదిలి ఆ దేశాలకు ప్రయాణం అవుతున్నారు. వారు తిరిగి వచ్చే సరికి సగం జీవితం అయిపోతుంది. కనీసం కన్నవారి కడసారి చూపులకూ నోచుకోని బతుకులు ఎన్నో... అసలు ఇదంతా లేకుండా ఉన్న ఊరిలోనే పనిచేసుకునే అవకాశం ఉంటే, దేశం కాని దేశం ఎందుకు వెళ్లాల్సి ఉంటుందని చంద్రమ్మ, చంద్రశేఖర్‌ వంటి పలువురు అంటున్నారు.