May 16,2022 09:21

మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో అతి వేగంగా సంస్కృతిపరమైన దిగుమతులు, మార్పులు జరుగుతున్నాయని అనేకమంది సరళంగానో, పరుషంగానో ప్రస్తావించడం మనందరికీ తెలిసిందే ! ప్రపంచంలో సంస్కృతిపరమైన సరిహద్దులు పలుచనైపోయి, పరస్పర సంస్కృతుల ప్రభావాలు స్పష్టమవుతున్నాయి. ఈ ప్రభావాలకీ, మార్పులకీ, కుటుంబ వ్యవస్థ, అనుబంధాలు అతీతం కాదు. మార్పు మాత్రమే శాశ్వతమన్న నానుడి అసహజం కాదు, అసాధారణమూ కాదు. చారిత్రకంగా చూస్తే ఆయా వర్తమాన పరిస్థితులకి అనుగుణంగా వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ ప్రవర్తనా ధోరణులు కనిపించడం కొత్తకాదు. అలా చూసుకుంటూ పోతే వర్తమానంలో మనం కొన్ని ఇంతకుముందు కనబడని పోకడలని గమనిస్తాం. దీనిపైనే ఈ ప్రత్యేక కథనం...

    కుటుంబ విలువలు, సమిష్టి ఆలోచనల నేపథ్యం గురించి మనం గర్వంగా చెప్పుకుంటాం. వ్యక్తిగత ధోరణుల కంటే సమిష్టి ఆలోచనలా ధోరణులకి ప్రాధాన్యతనిచ్చే సంస్కృతిగా మనని అభివర్ణించడం కొత్తకాదు. ఈ సమిష్టి ఆలోచనా ధోరణే మన దేశంలో.. కుటుంబ వ్యవస్థలోని పటిష్టతకి పునాదిగా వర్ణించడం జరుగుతుంది. అయితే 'మన' అన్న ఆలోచనా ధోరణి నుండి రకరకాల కారణాలు, దోహదాల వలన నేటి ఆలోచనా ధోరణితో 'నేను' అన్న దృక్పథం పెరగటం మన కంటికి కనిపిస్తున్న కాదనలేని వాస్తవం. దీనికి దోహదకారులేవో క్లుప్తంగా పరిశీలిద్దాం.

 

11


 

                                                              నేను.. మనం..

వర్తమాన యువత ఆలోచనా ధోరణిని, దిగుమతి చేసుకున్న పశ్చిమ ఆలోచనా ధోరణులని కారణాలుగా ప్రస్తావించడం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ సరిహద్దులు చెరిగిపోయిన ప్రపంచ సామాజిక - మానసిక ఆలోచనాధోరణి మనం గుర్తించాల్సిన వాస్తవం. ఈ క్రమంలో కేవలం యువత మాత్రమే కాదు మిగతా వికాసస్థితులలో ఉన్నవారు కూడా ప్రభావితమవుతున్నారు. ఈ నిజాన్ని మనం గమనించాలి, గుర్తించాలి. మారిన జీవన పరిస్థితులలో, జీవన విధానంలో మార్పు అన్ని కోణాలలోనూ విస్తరిస్తుంది. అంతే తప్ప.. కేవలం కొందరికే పరిమితం కాదు. ప్రభావ స్థాయిలో వ్యక్తిగత కుటుంబ, సామాజికపరమైన అంశాల కారణంగా అనుభవపూర్వకం, వివేకం వల్లనూ మార్పులు ఉండవచ్చు. కానీ.. అది కొందరిలో మాత్రమే ఉందన్న మాట పూర్తిగా వాస్తవం కాదు.
     కుటుంబం ఒక సమిష్టి వ్యవస్థ. శరీరంలో ఒక భాగానికి మార్పు కలిగినపుడు మిగతా భాగాలన్నీ ఎలా స్పందిస్తాయో.. ఎలా కూటమిగా వ్యవహరించి, తగిన సూచనలు చేసుకుంటూ మార్పుకి అలవాటుపడటానికో, ప్రభావాన్ని సాధ్యమైనంత తక్కువ స్థాయికి తీసుకురావడానికి ఎలా దోహదపడతాయో.. కుటుంబం కూడా అలానే కృషి చేస్తుందన్నది 'సమిష్టి' ఆలోచనా ధోరణిలోని అంతర్భాగమైన వ్యవహారశైలి. ఇందులో బంధాలు, అనుబంధాలు, పరస్పర సంభాషణా విధానాలు (కమ్యూనికేషన్‌), వ్యక్తిగత ఆలోచనా ధోరణులు. ఇవన్నీ అర్థం చేసుకుంటూ పరస్పర సహకారం అందించుకోవడం వంటి అనేక అంశాలు కలగలిసి ఉంటాయి. ఇది వ్యక్తికి పరిమితమైన విషయంగా మనం ఆలోచించము. కుటుంబం అంతా కలిసి ఒకటే అంశంగా తీసుకుంటాం.
     అనుబంధాలలో గాఢత పల్చబడి, వ్యక్తిగత సరిహద్దులు గట్టిపడినప్పుడు.. ఎవరికి వారు గిరిగీసుకుని.. అవతలివారు ముందు అనుబంధాల పటిష్టత కోసం కృషి చేయాలన్న ధోరణి ప్రస్ఫుటిస్తుంది. ఇలా ఆలోచించడం వలన కుటుంబాలలో కొన్ని సామాన్య పరిణామాలు ఎదురవుతున్నాయి.

  • సంఘర్షణలని నివారించలేకపోవడం. నిర్ణయాలలో అయోమయస్థితి. సమస్యల పరిష్కారం వైపుకి అడుగులు వేసే బదులు, సమస్యల వలయంలో మరింతగా కూరుకుపోవడం.
  • కుటుంబవ్యవస్థ, అనుబంధాల స్థాయి, స్థానాల విషయంలో అయోమయావస్థ. బాధ్యతల విషయంలో పరస్పర అంగీకారంతో కూడిన స్పష్టత లేకపోవడం.
  • తాత్కాలిక, వర్తమాన ఆలోచనాధోరణి. దీర్ఘకాలిక పర్యవసానాల గురించి అస్పష్టత లేదా దాటవేత ధోరణి.
  • తమ దృక్పథం, ఆలోచనల విషయంలో అస్పష్టత, పట్టుదల. పర్యవసానంగా ఎదుటివారి ఆలోచనాధోరణి కానీ జరుగుతున్న మార్పుల విషయంలో కానీ అవగాహనాలేమి. నా పట్టు సాగాలన్న పంతం. లేదా అతిగా జోక్యం చేసుకుని, వ్యక్తిగత పరిధంటూ లేకుండా అవతలివారిని ఉక్కిరిబిక్కిరి చేయడం.
  • ఉద్వేగపరమైన అవగాహన, అనుబంధాలు లేకపోవడం. లేదా పెంచుకునే అవకాశాలు, ప్రయత్నం చేయకపోవడం. లేదా పెంచుకుంటే రాగల ఇబ్బందుల వల్ల అసలు ఆ దృక్పథాన్ని ప్రోత్సహించక పోవడం.. పరస్పరం కమ్యూనికేషన్‌ లేకపోవడం.
  • పిల్లల పెంపకం నుండి వృద్ధాప్యంలో ఎలా జీవితాన్ని గడపాలి? అన్న విషయంలో.. వెసులుబాటుతోనూ, అవగాహనతోనూ, పరస్పర సంప్రదింపులతోనూ కూడిన ప్రణాళిక లేకపోవడం.
2

                                                                 ఏం చేయగలం ?

చాలామందికి లేని కొన్ని బలాలు మనకున్నాయి. బలాలకి నీడగా బలహీనతలు కూడా ఉంటాయి. కానీ నీడనే చూసుకుని అసలైన బలాలని తోసిరాజనడం సబబా అన్నది మనం ఆలోచించాలి. ఒక కుటుంబంలో చిన్నది కానీ పెద్దది కానీ సమస్యంటూ వచ్చినపుడు 'సమిష్టి' ఆలోచనలు ఇచ్చే బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఒక వ్యక్తిగా పరిష్కరించుకోలేని సమస్యలు జంటగా ఇరువురు కలిసి పరిష్కరించుకోవచ్చు. జంటగా పరిష్కరించలేనిది కుటుంబసభ్యులతో చర్చించడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఊహలు, తొందరపాటు నిర్ణయాలకన్నా మనసుకి దగ్గరైన వారితో చర్చించడం వల్ల ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. నిర్ణయం వ్యక్తిగతం కావచ్చు. జంట / కుటుంబం కలిసికట్టుగా తీసుకోవచ్చు. కానీ పరస్పర సంభాషణ ఆలోచనా స్థాయిలో స్పష్టతకు దోహదపడుతుంది. అనుబంధాలలో గాఢత, పరస్పర విశ్వాసం, విశ్వసనీయత పెంచుతుంది. ఈ క్రమంలో పాలుపంచుకునే కుటుంబసభ్యులలో ఓర్పు, సమస్య పరిష్కరించుకునే నేర్పుకి పెద్దతరం వారు మోడల్‌గా నిలబడగలిగితే.. తరాలు - అంతరాలు, దూరాలు అన్నీ వెనకడుగు వేస్తాయి. పెద్దవారిని సంప్రదించడంలోని లాభాలు తరువాత తరాలకి నిలబడతాయి. అలాకాక నేను పెద్దమనిషిని కనుక నా మాటే నెగ్గాలన్న పంతం చూపించినపుడు.. ఉద్వేగాల స్థాయీ పెంచుకుంటారు తప్ప, సమస్య పరిష్కారం దిశగా వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. సంయమనం, స్థిరత్వం, సమతూకం కలగలిపిన వివేకం ఏ వయసువారు ప్రదర్శించగలిగినా వారు ఇతరులకు ఆదర్శంగానే నిలబడగలరనడంలో సందేహమే లేదు.

     కుటుంబ విలువలు అన్న పదంలో రెండు భాగాలూ ముఖ్యమైనవే. కుటుంబం ప్రతి తరంలోనూ తమ తరువాతి తరాలకు అందజేసే విలువల పునాదులు కదిలిపోకుండా చూసుకోవాలి. అలా చేయాలంటే అహాలు, ఉద్వేగాల బానిసత్వం వదిలేయాలి. వాస్తవిక, తార్కిక ధోరణిని అర్థంచేసుకోవడం అవసరం. మారుతున్న ప్రపంచ ధోరణులకు అనుగుణంగా నడవడం నిజమే అయినా.. మన జీవన విధానాలకు, ధోరణులకి, మన విలువలకు అనుగుణ్యత ఎంతవరకూ ఉందన్న వాస్తవాన్నీ బేరీజు వేసుకోవడం మరొకవైపు అవసరం. తర్కబద్ధంగా, వాస్తవికంగా, 'నా' అన్న ధోరణికి పరిమితం కాకుండా.. సంఘజీవిగా ఉండాలి. కుటుంబసభ్యులుగా, భార్యగా / భర్తగా, తన బిడ్డలకు తల్లి / తండ్రిగా దీర్ఘకాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని.. జీవనశైలిని, నిర్ణయాలను మలచుకోగలిగితే కుటుంబాలకి తీవ్ర విఘాతాలు, సమస్యలు తగ్గే అవకాశం మెరుగుపడుతుంది.

 

3

                                                        కుటుంబం నుంచి కుటుంబాలు

ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అన్న/అక్క, ఒక చెల్లి/తమ్ముడు. ఇది చిన్న కుటుంబం. వీరికి తోడు తాతయ్య, బామ్మలు ఉండనే ఉంటారు. చిన్న కుటుంబమైనా, పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపడమంటే అందరూ సంతోషంగా ఉండటం. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నపుడు తల్లిదండ్రుల చెంతనే ఉంటారు. వారు పెద్దవారై, పెళ్లిళ్లు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే. అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి. ఒక కుటుంబం మరెన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశవృక్షపు వేళ్లు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఒక రోజైనా అందరూ కలుసుకోవాలని, సరదాగా గడపాలని కోరుకోవడం సహజం. ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలుకరించుకునే సమయం లేని కుటుంబాలు ఎన్నో. కేవలం ఫోన్‌లోనో, మొబైల్‌లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మనదేశం పుట్టిల్లు. ఇప్పుడు ఆ సంస్కృతి సమాజ గమనంలో మార్పు చెందింది. అయితే మార్పులను సహేతుకంగా, వాస్తవికంగా తీసుకోవడంలో వచ్చిన లోపాలు.. అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజూ చూస్తున్నాం. వీటిని ఒకరివైపు నుండి ఒకరు ఆలోచించే ధోరణి పెంపొందించుకోవాలి. అలాంటి పరిస్థితుల వల్లే నేడు అనేక కుటుంబాల మధ్య కనిపించే అన్యోన్యత సాధ్యమయ్యేది.

                                                                కుటుంబం అంటే...

     కుటుంబం అంటే ఒక ఇంట్లో నివసించే కొంత మంది మనుషుల సమూహం. వీరు సాధారణంగా పుట్టుకతోనో లేదా వివాహ బంధంతోనో సంబంధం ఉన్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు కుటుంబవ్యవస్థను గుర్తించాయి. ''కుటుంబం'' అనే పదాన్ని మానవులకే కాదు.. వృక్ష, జంతు సమూహాల్లోనూ ఉంది. అనేక వృక్ష, జంతు జాతులలో స్త్రీ, పురుష లింగ వ్యవస్థ ఉంది. జంతువుల్లో వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చు. పెద్ద జంతువులు పిల్ల జంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తాయి. వృక్షాల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన రకరకాల పుష్పించే, ఫలాలు అందించేవి ఉన్నాయి.
 

                                                                ఎలా వచ్చింది ?

విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 1992, మే 15న 'అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం' ను జరుపుకోవడానికి నిశ్చయించింది. కుటుంబ విషయంలో నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించాలని కోరింది. ఇవి కుటుంబ సమైక్యత, సంఘటితం అయ్యేందుకనే విషయం ప్రజలందరికీ అవగాహన కలిగించేందుకు తోడ్పడాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుంబాలకు దోహదపడాలి. నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామాజిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారాన్ని అందించాలి. కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొలగించి, ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పడం వంటి తదితర లక్ష్యాలతో ఈ రోజును జరుపుకుంటున్నాము. ఈ ఏడాది అంశం. ప్రపంచంలో పెరుగుతున్న పట్టణీకరణ.. కుటుంబ సంబంధాలు.

 

4


 

                                                                 ప్రాథమిక సూత్రం

''కుటుంబం''లో ఉండే కొన్ని ముఖ్యలక్షణాలు - రక్త సంబంధము, సహచరత్వము, ఒకే నివాసం. ఈ లక్షణాలు ఒక్కో సమాజంలో ఒక్కో విధంగా వర్తిస్తుంటాయి. కుటుంబవ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం - శారీరకంగా గానీ, సామాజికంగా గానీ వ్యక్తులను (లేదా జీవులను) పునరుత్పత్తి చేయడం. కనుక కుటుంబంలో సంబంధాలు, అనుభవాలు, అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి. పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబవ్యవస్థ ముఖ్యోద్దేశాలు - పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం, సంస్కృతిని వారికి అందజేయడం అనవచ్చు. అదే పెద్దల దృష్టి నుండి చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబ లక్ష్యంగా కనిపిస్తుంది. అయితే పిల్లలను కనడం, పెంచడం మాత్రమే కుటుంబవ్యవస్థ లక్ష్యాలుగా భావించనక్కరలేదు. స్త్రీ-పురుషులు పనులు చేసుకుంటూ, ఇంటిపని విభజన చేసుకుని, జీవనాన్ని సాగించే సమాజంలో.. ఆ ఇద్దరు (భార్యాభర్తల) సహజీవనం సమాజం ఆర్థికవ్యవస్థకు చాలా అవసరమౌతుంది. కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగానూ ఉంటుంది.

 

01


కేస్‌ 1 : విమల్‌, సుగుణ దంపతులు. అతని తల్లిదండ్రులు కొద్ది సంవత్సరాల క్రితం మంచం పట్టినప్పుడు వారి కోరిక ప్రకారం ఆయన సొంత ఊరికి వారిని తీసుకెళ్లి, వారు దాటిపోయే వరకూ వారితోనే సమయం గడిపారు. ఈ క్రమంలో విమల్‌ వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుంటే, దానికి సుగుణ తన సంపూర్ణ మద్దతునిచ్చింది. విమల్‌, సుగుణ దంపతులు ఆ తర్వాత సింగపూర్‌లోని కొడుకు దగ్గరికి వెళదామనుకుంటే అతను హైదరాబాద్‌లో తను కొన్న అపార్ట్‌మెంట్‌లో ఉండమని, వారికి అనారోగ్యం వస్తే అప్పుడు మనుషులని తనే ఏర్పాటు చేస్తానని చెప్పాడు.

 

02

కేస్‌ 2 : నారాయణ రిటైర్మెంట్‌ తర్వాత భార్యా సమేతంగా తీర్థయాత్రలు చేయాలని అనుకున్నాడు. కానీ అతని రిటైర్మెంటుకి ఆరునెలల ముందే భార్య యశోధర గుండెపోటుతో కన్నుమూసింది. రిటైర్‌ అయ్యాక తమ దగ్గరికి రమ్మని కొడుకు చెప్పి వెళ్లిపోయాడు. ఢిల్లీ మొదటిసారి భార్య లేకుండా వెళ్లిన నారాయణ జీవన విధానం కోడలికి, పిల్లలకి, అలాగే వారి విధానం నారాయణకి సరిపడలేదు. చిన్నకొడుకు దగ్గరికి వెళదామంటే తన కుటుంబానికే తన సంపాదన, తనకింట్లోకి సరిపోవట్లేదని వాపోయాడు. తను నమ్ముకున్న స్వామీజీ నడుపుతున్న ఆశ్రమంలో నారాయణకి ప్రశాంతత కనిపించింది.

 

04

కేస్‌ 3 : స్నేహ. సుశాంత్‌లకు పెళ్లయి మూడేళ్లు. ఈ మధ్యనే పుట్టిన బంగారుతల్లి. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు. ఇంతకంటే కావలసిన జీవితం ఏముందని అందరూ అన్నారు. అయితే ప్రసూతి శెలవు అయిపోయాక అటు తల్లి, ఇటు అత్తగార్లకి వారి వారి కుటుంబ బాధ్యతల వలన వీరి సిటీకి రాలేని పరిస్థితి. వాళ్లు వీరి వద్ద ఉండే అవకాశం లేకపోవడం వీళ్లని సమస్యల వలయంలోకి నెట్టింది. ఇంటి నుండి పనిచేసే అవకాశం తీసుకున్నా ఇద్దరూ ఆమె ఊరికి కానీ అతని ఊరికి కానీ వెళ్లడానికి నెట్‌వర్క్‌ సమస్యలు. అలాగే ఆస్పత్రి సేవల వసతులు వారికి అభ్యంతరాలయ్యాయి. మీ వాళ్లు రావచ్చు కదా! అంటే.. మీ వాళ్లు రావచ్చు కదా అన్న తగాదాలు, వాదనలు ఎక్కువయ్యాయి. డబ్బు ధారపోసినా నమ్మదగ్గ మనిషి దొరకకపోవడం.. ఒకవేళ ఎవరన్నా కొన్నాళ్లు ఉన్నా, ఇద్దరూ వంతులేసుకుని రాత్రిళ్లు పాపకోసం అలర్ట్‌గా ఉండాల్సి రావటం.. ఇలా సమస్యల మీద సమస్యలు.. తగాదాలు కూడా పెరిగిపోయాయి.

 

05

కేస్‌ 4 : ఇంజినీరింగ్‌ చదవడానికి చిన్న ఊరి నుండి పెద్ద సిటీకి వెళ్లిన సుస్మితకి ఫైనల్‌ ఇయర్‌కి వెళ్లేసరికి జీవితం చాలా మలుపులు తిరిగింది. కాలేజీలో టోనీతో పరిచయం, ఇద్దరూ కెరియర్‌ గురించి ఆలోచించుకుని కలిసి అప్లికేషన్లు పెట్టుకుని అమెరికా వెళ్లడం, గబగబా జరిగిపోయాయి. ఇద్దరూ ఒకేచోట అద్దె పంచుకుని ఇల్లు తీసుకున్నారు. చదువు, ఉద్యోగం వెంట వెంటనే జరిగాయి. జీవితంలో స్థిరపడేదాకా తమ అనుబంధం ఎవరితోనూ పంచుకోకూడదని నిర్ణయించుకున్నారు. గనక తమ 'లివ్‌-ఇన్‌' సంబంధాన్ని ఇద్దరూ ఎవ్వరికీ తెలియనివ్వలేదు. అయితే సుస్మితకి తన కుటుంబం నుండి పెళ్లి విషయంలో ఒత్తిడి పెరిగింది. పెళ్లి గురించి ఆమె మాట్లాడటం మొదలుపెట్టాక ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. లివ్‌ఇన్‌ అంటే తెలిసీ పెళ్లి విషయంలో గొడవలెందుకని టోనీ అంటే.. ఎప్పటికైనా నిర్ణయం తీసుకోకతప్పదు కదా ! అని సుస్మిత వాదన. రోజుల తరబడి వాదనల తర్వాత బ్రేక్‌ అప్‌ అన్న స్థితికి వచ్చారు. సుస్మిత అంతగా ప్రేమించిన టోనీ వాడుకుని వదిలేశాడన్న బాధతో కుంగుబాటులోకి జారిపోయింది.

 

06

కేస్‌ 5 : నిశిత, నిశ్చల్‌ దంపతులు. కార్పొరేట్‌ ఉద్యోగులు. ప్రేమ వివాహం తరువాత తమ సిటీలో ఫ్లాట్‌ కొనుక్కుని, కాపురం పెట్టారు. అనుకోకుండా వచ్చిన గర్భం విషయంలో ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. ఇరుపక్షాల పెద్దల పట్ల వారిద్దరికీ పరస్పర గౌరవం లేకపోవడంతో.. సహాయానికి ఎవరూ రారన్న వాస్తవం జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమె తరుపు వారి గురించి అతను, అతని తరపు వారి గురించి ఆమె తగాదాలు పడటం కొనసాగించారు. ఇద్దరి తల్లులూ రాజీపడి వచ్చాక కూడా ఈ తగాదాలు మామూలయ్యాయి. పరస్పర విమర్శలు, అవమానాలు తట్టుకోలేక తల్లులు, ప్రేమ జంట కూడా అతలాకుతలమయ్యారు. ఎవరూ ఎవరికీ నచ్చజెప్పలేకపోయారు. చివరికి నిశిత, తల్లి ఆమె ఊరికి వెళ్లిపోయారు.                                                                           ఈ సమస్యలన్నీ ఇదివరకు కాలాల్లో లేవా ? అప్పుడు మాత్రం అపార్థాలతో, పరిస్థితులను అర్థం చేసుకోలేక సతమతమయిన కుటుంబాలు, కలహాల కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు లేవా ? అన్న సందేహం మనకి తలెత్తుతుంది. అలాంటి దృష్టాంతాలు అరుదేమీ కాదు. కానీ మారిన ప్రపంచ వ్యవస్థలో కాలానుగుణమైన సంస్కృతీపరమైన మార్పులతో, పెరిగిన వ్యక్తిగత - ప్రపంచరీతుల అవగాహన.. మారిన ఉద్యోగ, ఆరోగ్య, వివాహపరమైన ఆలోచనారీతులు.. కొన్ని మాధ్యమాల ప్రభావాలు, వాటి ద్వారా కానీ, తమంతట తాముగా విస్తృతం చేసుకున్న కొన్ని ఆలోచనల వలన కానీ.. దిగుమతి చేసుకున్న ప్రభావాల వల్ల కానీ ఆలోచన, ప్రవర్తనాపరమైన మార్పులు ఏర్పడ్డాయి. ఇలా ఎన్నెన్నో కారణాలు 'సర్దుబాటు' అనే అంశం తాలూకు నిర్వచనాన్ని ప్రశ్నింప చేస్తున్నాయి.

డాక్టర్‌ జి. పద్మజ
హెల్త్‌ సైకాలజీ హెడ్‌, యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌. డిప్యూటీ డీన్‌, స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌.

11