Oct 17,2020 21:46

ఫరీద్‌కోట్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఒక కుటుంబాన్ని పొట్టనపెట్టుకుంది. అప్పటి దాకా సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఎలాంటి ముందుచూపు లేకుండా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ అప్పులు పాలు చేసింది. ఈ లాక్‌డౌన్‌తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యభర్తలు తమ ఇద్దరు పిల్లల్ని చంపి, తామూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కష్టాలకు లాక్‌డౌనే కారణమని సూసైడ్‌ నోట్‌లో వారు పేర్కొన్నారు. ఈ దారుణం పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ జిల్లాలోని కేలార్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాకు చెందిన ధర్మపాల్‌ కుటుంబం పంజాబ్‌కు వలస వచ్చి కేలార్‌ గ్రామంలో ఇటుక బట్టీ నిర్వహిస్తుండేది. లాక్‌డౌన్‌తో వీరికి పనిలేకుండా పోయింది. ఉపాధి లేక, చేతిలో డబ్బులు లేక జీవనం దుర్భరంగా మారడంతో ఆ కుటుంబం అప్పులు పాలైంది. తాను రూ. 9 లక్షల వరకూ అప్పులు పాలయ్యానని ఆ లేఖలో ధర్మపాల్‌ పేర్కొన్నారు.