Jun 02,2023 22:46

క్వారీ వద్దని అధికారులకు వినతిపత్రం ఇస్తున్న మన్నీల గ్రామస్తులు

     అనంతపురం ప్రతినిధి : 'క్వారీ పరిశ్రమ వల్ల తీరని నష్టం జరుగుతుంది.' చుట్టుపక్కలున్న భూముల్లో ఇప్పటికే పంటలు పండించలేని పరిస్థితులు నెలకొన్నాయి. కావున క్వారీ ఏర్పాటును మానుకోవాలి అంటూ అనంతపురం రూరల్‌ మన్నీల గ్రామ రైతులు ప్రజాభిప్రాయసేకరణ బృందంతో తేల్చిచెప్పారు. బీఎస్పీ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థకు మన్నీల గ్రామంలో 13.665 హెక్టార్ల భూమి లీజుకివ్వడానికి శుక్రవారం నాడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మన్నీల గ్రామ పరిధిలో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణను పలువురు రైతులు వ్యతిరేకించారు. బీఎస్పీ ప్రయివేటు లిమిటెడ్‌ సంస్థపై గతంలోనే అనేక ఆరోపణలున్నాయి. లీజుకిచ్చిన స్థలంలో కాకుండా మరోచోట మైనింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై మైనింగ్‌ శాఖ ఇదివరకే చర్యలు తీసుకుందని మన్నీల గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సంస్థకు మరోమారు 13.665 హెక్టార్ల భూమిని లీజుకివ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం, ప్రజాభిప్రాయ సేకరణ జరపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయానికి సంబంధించిన సమాచారాన్ని ఒక రోజు ముందుగా అంటే గురువారం సాయంత్రం రెండు చోట్ల నామమాత్రంగా టాంటాం వేయించి మమ అనిపించారు. డిఆర్‌ఒ గాయత్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అనేక మంది రైతులు క్వారీ ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ తమ పొలం గట్టునే మైనింగ్‌ హద్దుగా చూపించి మైనింగ్‌ లీజుకు ఇస్తున్నారని చెప్పారు. అక్కడ మైనింగ్‌ జరిగేతే వచ్చే దుమ్ము వలన తమ పొలాల్లో పంటలు ఏమాత్రం పండవన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కనీస సమాచారాన్ని కూడా గ్రామంలో తెలియజేయకుండా జరపడం సరైంది కాదని అన్నారు. మరో రైతు మాట్లాడుతూ తమ పొలంలో ఇది వరకే మైనింగ్‌ వల్ల పంటలు దెబ్బతింటున్నాయని చెప్పారు. ఇదే విషయాన్ని మైనింగ్‌ యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చామన్నారు. దుమ్ము లేవకుండా నీటిని కొట్టాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. పూత దశలో దుమ్ము పంటపై పడటంతో దానిమ్మ పంట మొత్తం దెబ్బతిందని డిఆర్‌ఒకు తెలియజేశారు. మైనింగ్‌ లీజుకు ఇస్తున్న ప్రాంతంలో చుట్టూ వంద ఎకరాల వరకు అసైన్డు భూములున్నాయని చెప్పారు. ఈ భూముల్లో మైనింగ్‌ వలన పంట పండే పరిస్థితి లేకుండాపోతుందని చెప్పారు. ఇంత మంది రైతులకు నష్టం జరుగుతోందని డిఆర్‌కు తెలియజేశారు.
నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌
సిపిఎం నాయకులు రామాంజినేయులు

బిఎస్సి సంస్థ ఇదివరకే నిబంధనలకు విరుద్ధంగా మన్నీల గ్రామంలో మైనింగ్‌ జరిపిందని సిపిఎం నాయకులు రామాంజినేయులు తెలిపారు. ఇప్పుడు అదే సంస్థకు మరింత భూమిని మైనింగ్‌ కోసం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధపడడం సరికాదన్నారు. ఈ సంస్థ వల్ల స్థానికంగా ఒక్కరికి కూడా ఉపాధి లభించలేదని చెప్పారు. ఇప్పుడు ఉన్న భూముల్లోనూ మైనింగు వలన పంటలు పండకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కావున ఈ సంస్థకు మైనింగ్‌ లీజు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కూడా అందరికీ సమాచారం లేకుండా రహస్యంగా జరపుతున్నారని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులతోపాటు గ్రామ రైతులు త్రివిక్రమ్‌, రామాంజినేయులు, హరీష్‌, మడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.