Sep 14,2021 18:37

అబుదాబి: ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మ అబుదాబిలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో చెమటోడ్చుతున్నాడు. రోహిత్‌ ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్న ఫొటోలను ఆ ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్‌లో మంగళవారం పోస్ట్‌ చేసింది. ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదోటెస్ట్‌ రద్దు కావడంతో రోహిత్‌, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఛార్టర్‌ ఫ్లైట్స్‌లో మాంచెస్టర్‌ నుంచి అబుదాబికి శనివారం ఉదయం చేరుకున్న సంగతి తెలిసిందే. అబుదాబి చేరుకున్న వీరంతా వెంటనే ఆరు రోజుల క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇంగ్లండ్‌ నుంచి బయల్దేరేటప్పుడు మాంచెస్టర్‌లో జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో వీరంతా అబుదాబికి బయల్దేరి వెళ్లారు. ఈ ఏడాది మేలో వాయిదాపడ్డ ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-14 మిగిలిన మ్యాచ్‌లు యుఏఇ వేదికగా సెప్టెంబర్‌ 19నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్‌ అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌-ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో తిరిగి ప్రారంభం కానుంది.