Aug 18,2022 23:24

మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్న ప్రజలు

ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని దాలివలస, మర్రివలస, పిండ్రంగి, గవరపాలెం గ్రామాల పరిధిలో క్వార్ట్‌ జైట్‌ ఖనిజం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని దాలివలస, గవరపాలెం గ్రామాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయా గ్రామాల ప్రజలు కరాఖండీగా చెప్పారు. ఇప్పటికే ఈ కొండల్లో చేపట్టిన తవ్వకాల వల్ల తమ తోటలకు నష్ట జరిగిందని, దుమ్మూధూళితో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, మళ్లీ తవ్వకాలకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు.
మండలంలోని దాలివలస సర్వే నెంబర్‌ 182, మర్రివలస సర్వే నెంబర్‌ 1, పిండ్రంగి సర్వే నెంబరు 284, 298ల్లోని 30.35 ఎకరాల్లోని క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌కు ఎంఎఆర్‌ కుమారి, గవరపాలెం సర్వే నెంబర్‌ 562లోని 40.47 ఎకరాల్లోని క్వార్ట్‌జైట్‌ మైనింగ్‌కు వి.విజయలక్ష్మి దరఖాస్తు చేయగా, ఇందు కోసం గురువారం దాలివలస, గవరపాలెం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దాలివలసలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో దాలివలస, మర్రివలస, పిండ్రంగి గ్రామాల ప్రజలు పాల్గొని పార్టీలకు అతీతంగా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. మైనింగ్‌కు అంగీకరించేది లేదని ఆ మూడు గ్రామాల సర్పంచ్‌లు స్పష్టం చేశారు. సర్పంచులకు ముందుగా తెలియజేయకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఏమిటని పిండ్రంగి సర్పంచి జాగరపు రామలక్ష్మి ప్రశ్నించారు. ఈ సమయంలో వేరే ప్రాంతానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ నాయకుడు జెటి.రామారావు మైనింగ్‌కు అనుకూలంగా మాట్లాడుతుండగా, మూడు గ్రామాల ప్రజలు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన్ను పోలీసుల బందోబస్తుతో బయటకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కొంతసేపు సభా వేదిక వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, మండల కార్యదర్శి రొంగలి ముత్యాలనాయుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయినబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ గతంలో అనుమతులు లేకుండానే సుమారు 20 ఏళ్ల పాటు మైనింగ్‌ చేసి కోట్ల రూపాయలు లాభాలు గడించారని, వారికి ప్రభుత్వం నామమాత్రం పెనాల్టీ వేసి, ఇప్పుడు మళ్లీ అనుమతులు ఇవ్వడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. దీనివలన చిన్న సన్నకారు రైతులు ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న జీడి, మామిడి, కూరగాయల పంటలకు అపార నష్టం సంభవిస్తుందని తెలిపారు. గొర్రెలు, మేకలు పెంపకందారులకు జీవాలను పెంచుకొనేందుకు అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్‌ వల్ల వచ్చే కాలుష్యం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతారన్నారు. టిడిపి మాడుగుల నియోజవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలోని ప్రజలకు ఇష్టం లేకుండా మైనింగ్‌ పనులకు సిద్ధం చేయడం సిగ్గుచేటన్నారు.
గవరపాలెంలో అప్రజాస్వామికంగా ప్రజాభిప్రాయ సేకరణ
గురువారం మధ్యాహ్నం గవరపాలెంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ అప్రజాస్వామికంగా జరిగింది. ఇక్కడ మైనింగ్‌ను వ్యతిరేకించే వారిని భారీ పోలీసు బందోబస్తు ద్వారా మాట్లాడివ్వకుండా చేశారు. మైనింగ్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అనుకూలంగా అధికారులు, పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. మైనింగ్‌దారుల ప్రలోభాల వల్ల కొందరు తమకు అభ్యంతరం లేదని మాట్లాడగా, ఈ కొండకు దగ్గరిగా నివాసాలు ఏర్పాటు చేసుకొని, కొండనే నమ్ముకొని జీవాలను మేపుకుంటూ జీవనం సాగించే యాదవ సామాజిక తరగతి వారు మైనింగ్‌ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ మైనింగ్‌ చేస్తే తమ జీవనం పూర్తిగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి పి.వెంకటరమణ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తెలియజేసిన అభిప్రాయాల నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, ఇక్కడ ఇటువంటి అవకతవకలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుదర్శన్‌, తహశీల్దారు రమేష్‌బాబు, ప్రజాసంఘాల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, కెవిపిఎస్‌ నాయకులు గాడి ప్రసాదు, సిపిఐ నాయకులు వేచలపు కాసుబాబు, రెడ్డి అప్పలనాయుడు నాలుగు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.