Nov 21,2020 11:19

ప్రముఖ కవి, జర్నలిస్ట్‌ దేవిప్రియ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన... శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.  దేవిప్రియ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చక్కటి కవిత్వాన్ని రాయగల దిట్ట. దళిత బహుజన సాహిత్యాన్ని ఎంతో ప్రేమించాడు. దేవిప్రియ అసలు పేరు ఖ్వాజా హుస్సేన్‌. ఈయన కలం నుంచి జాలువారిన కార్టూన్‌ కవితల 'రన్నింగ్‌ కామెంట్రీ' పాఠకలోకం మన్ననలు అందుకుంది. 'అమ్మచెట్టు', 'నీటిపుట్ట', 'చేప చిలుక', 'తుఫాను తుమ్మెద', 'సమాజానంద స్వామి', 'గరీబు గీతాలు', 'గాలిరంగు', 'గంధకుటి' తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు. 'గాలిరంగు' కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. 1980లో 'అమ్మచెట్టు' కవిత్వానికి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు, 1991లో 'నీటిపుట్ట' కవితా సంకలనానికి సినారె కవితా పురస్కారం, 2001లో కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం, 2013లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం అందుకున్నారు.

''నిరంతరం ప్రజల మేలు
కోరుకున్న సుందరయ్య
నీలాగా నిప్పులాంటి
నేతలు మా కెందరయ్య!

సోషలిజం ఈ దేశపు
బిడ్డల తల నిమిరినప్పుడు,
ఎర్రబడిన ఏ మబ్బుల
తేరుమీదో వచ్చి చూడు!!''
... అంటూ పుచ్చలపల్లి సుందరయ్య గారు చనిపోయిన రోజున, వారికి నివాళిగా దేవిప్రియ రాసిన ఈ కవిత... ఎప్పటికీ ఓ ఆణిముత్యమే.  దేవిప్రియ మృతి తెలుగు సాహిత్యానికి తీరనిలోటు.

దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. దేవిప్రియ 'ఉదయం' సహా పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అసలు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్‌. కానీ 'దేవిప్రియ' కలంపేరుతో రచనలు చేసేవారు. తండ్రి షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌, తల్లి షేక్‌ ఇమామ్‌ బీ. జర్నలిస్టుగా ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు. ఆయన రన్నింగ్‌ కామెంటరీ కార్టూన్‌ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. దాసి, రంగులకల తదితర సినిమాలకు ఆయన పనిచేశారు.