Jan 11,2021 08:11

        కొలకలూరి భాగీరథమ్మ జాతీయ సాహితీ పురస్కారం పొందిన కళారత్న బిక్కి కృష్ణ రాసిన 'కవిత్వం-డిక్షన్‌' ఒక అపూర్వ సష్టి. ఆధునిక కవితా నిర్మాణ పద్ధతులపై వచ్చిన ఒక అథెంటిక్‌ పరిశోధనా గ్రంథం. తెలుగు కవిత్వంలో సమగ్రంగా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా కవితా నిర్మాణ పద్ధతుల గురించి అనేక కోణాలు ఆవిష్కరించిన గ్రంథమిది. కవిత్వమంటే ఏమిటి? కవిత్వం ఎన్ని పద్ధతుల్లో (devices) నిర్మించవచ్చు? ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కవితా నిర్మాణ పద్ధతులేవి? భారతీయ కవుల కవితా నిర్మాణ పద్ధతులేవి? ఏయే కవులు ఎలాంటి కవితా నిర్మాణాలు అనుసరించారు? కొత్తగా కవిత్వం రాసే కవులు ఎలాంటి కవిత్వపు భాషను ఉపయోగించాలి? కవిత ఎత్తుగడ, నిర్మాణం, ముగింపు ఎలా ఉండాలి? శ్రీశ్రీ మొదలు శివారెడ్డి వరకు తెలుగు వచన కవితా నిర్మాణాలు ఎలా ఉన్నాయి? ఎవరెవరి కవితా సంపుటాలు ఎందుకు చదవాలి? ఇలాంటి అతి ముఖ్యమైన అంశాలెన్నో బిక్కి కృష్ణ తన కవిత్వం - డిక్షన్‌లో కూలంకషంగా విశ్లేషించారు. మొత్తం 152 పేజీలున్న ఈ బహత్‌ పరిశోధనా గ్రంథంలో 23 విభాగాలున్నాయి. అనుబంధంలో 'కవిత్వం ముద్రణ ఒక కళాత్మక క్రియ', 'కవిత్వ ప్రచార సాధనాలను ఉపయోగించుకుంటున్నారా?' అన్న రెండు విభాగాలున్నాయి.
       ఇక పుస్తకంలోని కవితా నిర్మాణ పద్ధతుల విభాగాల పేర్లలోనే ప్రతి చాప్టర్‌లో తాను చెప్పబోయే అంశాన్ని సింబలైజ్‌ చేస్తూ శీర్షికలు పెట్టడం జర్నలిస్టు, కవి, విమర్శకుడైన కష్ణకే చెల్లింది. 'కవిత్వం ఆత్మకళే కాదు.. రూపకళ' అన్న మొదటి విభాగం.. ఇవాళ కవిత్వం ఎలా ఉండాలి? అన్న ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో పాత పదబంధాలను, అరిగిపోయిన మెటాపర్లను, చర్విత చర్వణమైన అభివ్యక్తికి స్వస్తి చెప్పి శ్రీశ్రీ ఫ్రెంచి కవుల సింబాలిజంను ఫాలో అయ్యాక ఎలాంటి కవితా నిర్మాణం చేపట్టారు? కాళ్ళు తెగిన ఒంటరి ఒంటె లాంటి సరికొత్త ప్రతీకలు ఎలా ఉపయోగించారో మొదలైన విషయాలు అరటిపండు ఒలిచి పెట్టినట్టు వివరించారు. చాప్టర్‌ చివర్లో కవిత్వపు వాక్యనిర్మాణం, వ్యాకరణ దోషాలు తదితర విషయాలపై చేసిన పది సూచనలు కవులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. రెండో విభాగం 'కవిత్వంలో కొత్త కోణాలు' శీర్షికా వ్యాసంలో కవిత్వం తెలుసుకునే రాస్తున్నారా? కవితా నిర్మాణ పద్ధతులు అంటే ఏమిటి? symbol అంటే ఏమిటి? simile అంటే ఏమిటి? పదచిత్రాలు, భావ చిత్రాలు ఎలా ప్రయోగించాలో తెలుసా? imagery అంటే ఏమిటి? వచన కవిత్వపు భాష ఎలా ఉండాలి? మొదలైన అంశాలు సోదాహరణంగా చర్చించారు. 'అనుకరణ కూడా ఒక కళే!' అనే చాప్టర్‌లో కిక్‌ ఫార్ములా (kicc formula) keen observation (సూక్ష్మ పరిశీలన), imitation (అనుకరణ), imagination (ఊహాకల్పన), creativity (సజన) గురించి చర్చించారు. చివరిలో గేయ కవితకు వచన కవితకున్న స్పష్టమైన తేడాను పది సూచనల్లో వివరించారు. అనేక మంది కవితలను ఫార్ములాతో అనుసంధిస్తూ విశ్లేషించారు. 'కవిత్వం ఎలా ఉండాలి?' శీర్షికలో లోతైన చర్చ చేశారు. 'కవిత్వం గిజిగాడు గూడు అల్లినట్టుండాలి' అన్న విభాగంలో కవితా వస్తువు, శిల్పం, ప్రతీకలు, భాష, కవితల నిడివి తదితర అంశాలను అనేక మంది కవితలను విశ్లేషిస్తూ సాధికారికంగా విశ్లేషించారు. తర్వాత 'ఇమేజెస్‌ వల్లనే కవితకు ఇమేజ్‌', 'ప్రతి ఊహా ఒక వ్యూహం', 'కవి ఆలోచనలను వర్ణ(నా)మయం చేసే 'అల్లిగొరి'' లాంటి చాప్టర్లలో దేశ, విదేశీ కవుల కవితా నిర్మాణాలను సిద్ధాంతబద్ధంగా అనితర సాధ్యంగా సమన్వయం చేస్తూ అనుశీలించారు. ఈ పుస్తకంలో పాశ్చాత్య కవితా నిర్మాణాలను 'కవిత్వం - వస్తు సత్సంబంధితమేనా?' అంటూ objective co-rrelavive కవితా పద్ధతిని, మెటానమి, అపోస్ట్రోపె అంటే ఏమిటి? వచన కవిత్వంలో 'పేరల్లెల్లిజం' అవసరముందా? కవితా రచనలో 'అనఫొర' ఒక రూపనిర్మాణ కౌశలం లాంటి చాప్టర్లను చదివితే కవితా నిర్మాణ పద్ధతుల్లో ఇన్ని కోణాలున్నాయా? అని ఆశ్చర్యపడతాం.
        వీటిని పాశ్చాత్య భారతీయ కవుల కవితలతో పోల్చి రూపనిర్మాణ పద్ధతుల రహస్యాలు బిక్కి కృష్ణ వివరించడానికి ఎన్నేళ్ళు, ఎన్ని గ్రంథాలు పఠించి, ఎంతగా శ్రమించారా? అనిపిస్తుంది. ఏదైతేనేం సముద్రంలోకి దూకి ఒడ్డున పడ్డాడు. ఇంకా ఈ 'కవిత్వం-డిక్షన్‌'లో 'కవి ప్రతిభకు సవాల్‌ -ఇమేజరీ', 'ప్రతీకలు కవితా నిర్మాణపు పనిముట్లు కావాలి', 'కవిత్వమంటే శైలిలో ఉన్న మ్యాజిక్కేనా?', 'వస్తువును బట్టి శిల్పం మారుతుందా?', 'కవిత్వంలో శబ్దచిత్రణ అంతరించిందా?', 'ప్రజాస్వామిక ప్రతీక వచన కవిత' మొదలైన విభాగాల్లో కవితా నిర్మాణ పద్ధతులపై విస్తతంగా విశ్లేషణలు చేసి సాధికారిక స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఈ పుస్తకంలో అనవసరమైన వాక్యం ఒకటి కూడా లేదంటే అందులో ఆశ్చర్యం లేదు. బహుశా కృష్ణ జర్నలిస్టు కావడంవల్లనేమో వాక్య విన్యాసం సరళంగా సాగింది. ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని, విదేశీ సాహిత్యాన్ని విస్తతంగా అధ్యయనం చేయడం వల్లనేమో సాధికారికమైన విమర్శలతో గ్రంథం ఆమూలాగ్రం తన ప్రతిభాకాంతులు మెరిపించారు. గతంలో కట్టమంచి రాసిన 'కవిత్వ తత్వ విచారం', శేషేంద్ర 'కవిసేన మేనిఫెస్టో' వంటి వాటికి భిన్నంగా బిక్కి కృష్ణ కవితా నిర్మాణ పద్ధతులపై రాసిన 'కవిత్వం-డిక్షన్‌' ఒక సమగ్ర కవిత్వ నిర్మాణ పరిశోధనా గ్రంథమని చెప్పొచ్చు. ఈ గ్రంథానికి ముందు మాటలు రాస్తూ రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి కృష్ణది నిర్భయ గొంతుక. స్వయంగా కవి, విమర్శకుడు అయిన బిక్కి కృష్ణ దష్టిలో కవిత్వ రచన కాలక్షేప వ్యవహారం కాదు, సీరియస్‌ యాక్టివిటీ. ఈ పుస్తకంలో కవితా సామగ్రికి సంబంధించి సిమిలి, మెటపర్‌, అలిగొరి, మెటానమి, పేరెల్లలిజం, ఫర్సోనిఫికేషన్‌, అనఫొర, ప్రతీకలు, ఇమేజరి, సింబాలిజం వంటి పాశ్చాత్య భావనల్ని (poetic devices) లోతుగా చర్చించారు. కవిత్వంలో అస్పష్టత వంటి అంశాలను విమర్శకు పెట్టారు. ప్రపంచ కవులతో పాటు తెలుగు కవులు కూడా తమను తాము నిరంతరం అప్‌డేట్‌ చేసుకోవాలని కాంక్షించాడు. కవిత్వాన్ని ప్రేమిస్తూ, కవులను గౌరవిస్తూ కవిత్వాన్ని రక్షించే కర్తవ్యతా నిర్వహణ ఈ గ్రంథంలో కనిపించే ప్రాణభూతమైన లక్షణం' అంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రభ ఎడిటర్‌ వైఎస్‌ఆర్‌ శర్మ ఈ పుస్తకం గురించి రాస్తూ 'బిక్కి కృష్ణ నిస్వార్థ కవి. కాబట్టి మరెందరో కవుల్ని సాహితీ యవనిక మీదికి తేవాలని కంకణం కట్టుకున్నాడు. అందుకు తెలుగు నేల విస్ఫోటనమై కవుల సమాజమే రావాలి. అందుకోసం కవిత్వంపై ఆసక్తి రేకెత్తించడం, కొత్త కలాలను పట్టించడం, కొత్త గళాలను నినదింపజేయడం, ఇదే తన లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. అందుకోసం కొత్తవారికి దిక్సూచిగా ఈ పుస్తకం ఉపయోగపడాలని ఆయన తపన. ఆయన కషి వథా కాదు. వ్యథ మిగలదు. ఆయన కోరుకున్న కొత్త కవుల బంగారు లోకాన్ని స్వాగతిద్దాం'' అంటూ ప్రశంసించారు. మరో ప్రముఖ నవలాకారులు, కవి, సినీ దర్శకులు డా.ప్రభాకర్‌ జైనీ తన ముందుమాటలో 'బిక్కికష్ణ ప్రాచ్య, పాశ్చాత్య అలంకార సిద్ధాంతాల అనుశీలనంతో పాటు ఆధునిక, అత్యాధునిక కవితా సిద్ధాంతాలను, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కవుల కవితా రూపాలను, నిర్మాణాలను, కవితా సౌందర్యాన్ని తన అసాధారణ దార్శనికతతో ఆవిష్కరించారు.' అని పేర్కొన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం త్రిశతి, ద్విశతి, శతకవి సమ్మేళనాల వేదికలపై ఉచితంగా పంచిపెట్టారు. ఇప్పుడు బిక్కి కష్ణ దేశ, విదేశీ కవులకు మెయిల్‌లో ఫిడిఎఫ్‌ ఫైల్స్‌ పంపడం ద్వారా 'కవిత్వం-డిక్షన్‌' పుస్తకాన్ని అందరికీ అందజేస్తున్నారు.

- రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
98665 83907