Aug 10,2022 09:12

నౌరోబి : కెన్యాలో పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తదుపరి దేశాధ్యక్షుణ్ణి ఎన్నుకునేందుకు కెన్యా ప్రజలు మంగళవారం పోలింగ్‌ బూత్‌ల వద్ద క్యూ కట్టారు. కాగా, కొన్ని చోట్ల రాత్రి కూడా పోలింగ్‌ జరిగినట్లు సమాచారం. దీంతో పోలింగ్‌ను పొడిగించినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ఆహార ధరలు, లోతుగా పాతుకుపోయిన అవినీతితో విసిగి వేసారిపోయిన పౌరులు... అధికార మార్పు కోసం భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే యువ ఓటర్లు ఈ పోలింగ్‌పై ఆసక్తి కనబర్చలేదు. అసమానతలు, మారని అభ్యర్థులు, రాజకీయ వ్యవస్థపై విసుగు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో ఓటు నమోదు చేసుకోలేదని ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ప్రజలు చూస్తున్న పోటీ మాత్రం ఇద్దరు కీలక వ్యక్తుల మధ్యే నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు ఆరెంజ్‌ డెమొక్రటిక్‌ అలియన్స్‌ అభ్యర్థి రైలా ఒడింగా (77)తో పాటు ప్రస్తుత ఉపాధ్యక్షుడు, యునైటెడ్‌ డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి విల్లియం రూటో (55) మధ్య హోరాహొరీ పోరు సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు ఉరుహు కెన్యాట్టా ఇప్పటికే రెండు సార్లు పదవిని చేపట్టడంతో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడయ్యారు. అయితే ఆయన దీర్ఘకాల ప్రత్యర్థి ఒడింగాకు మద్దతునివ్వడం ఆశ్చర్యం. గతంలో పోలింగ్‌లో జరిగిన అవకతవలకు దృష్టిలో ఉంచుకున్న ఎన్నికల సంఘం ఈ సారి భారీ భద్రత చర్యలు తీసుకుంది. కెన్యాలో గెలవాలంటే అభ్యర్థికి 50 శాతానికి పైగా ఓట్లు రావాల్సి ఉంటుంది. అలాగే కెన్యాలోని 47 కౌంట్లీలో 24లో పావు వంతు ఓట్లు అవసరం.