Oct 02,2022 16:39

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎదుర్కోవడంలో కొడియేరి బాలకృష్ణన్‌ ఛాంపియన్‌లా పనిచేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కొనియాడారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం ఉదయం ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జయరామ్‌ అధ్యక్షతన కొడియేరి సంతాపసభ జరిగింది. ఈ సందర్భంగా కొడియేరి చిత్రపటానికి శ్రీనివాసరావు, మధు, రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, బాబూరావు, మంతెన సీతారాం, తులసీదాసు, పి జమలయ్య, సుబ్బరావమ్మతో పాటు పలువురు రాష్ట్ర కమిటీ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. సంతాప సూచకంగా మౌనం పాటించారు. అనంతరం వి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాలకృష్ణన్‌ మరణం పార్టీకి, ఉద్యమానికి తీరని నష్టమని పేర్కొన్నారు. కేరళలో బలమైన ఉద్యమానికి కేంద్రమైన కన్నూరు నుండి విద్యార్థి ఉద్యమంలోకి వచ్చిన కొడియేరి పార్టీ పొలిట్‌బ్యూరో వరకూ వేర్వేరు స్థాయిల్లో పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా కన్నూరులో పార్టీని బలహీనపర్చాలనే కుట్రతో బిజెపి నాయకులు కర్నాటకలోని మంగళూరు నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ దుండగులను పంపించి భౌతిక దాడులకూ పాల్పడ్డారని, సంఫ్‌ు పరివార్‌ సాగించిన ఆ కుట్రలను కొడియేరి ధైర్యంగా ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పటికీ అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆకృత్యాలు సాగుతున్నాయని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పైనా ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు దాడులకు దిగారని, రైలులో ప్రయాణించే సమయంలో హత్యాయత్నానికి కూడా ప్రయత్నించారని తెలిపారు. విజయన్‌, కొడియేరి ఇద్దరూ కన్నూరు జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలను ధైర్యంగా తిప్పికొడుతూ ఛాంపియన్లుగా పని చేశారని కొనియాడారు.
సిపిఎం సీనియర్‌ నాయకులు పి మధు మాట్లాడుతూ కొడియేరి బాలకృష్ణన్‌ మంచి ఆర్గనైజరని పేర్కొన్నారు. ఎన్నో ఉద్యమాల్లో, పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గని ప్రజాభిమానాన్ని చూరగొన్నారని గుర్తు చేశారు. విబేధాలు వచ్చిన సమయంలో అందరినీ ఒప్పించడంలో జయప్రదం అయ్యారని పేర్కొన్నారు. బాలకృష్ణన్‌ మరణం కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్‌ దేశానికి తీరని నష్టమని అన్నారు.