Oct 02,2022 21:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ : సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇటీవలి వరకూ పార్టీ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన గొప్ప నాయకుడు కొడియేరి బాలకృష్ణన్‌ మృతికి పొలిట్‌బ్యూరో తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. చెన్నైలోని ఆసుపత్రిలో శనివారం కన్నుమూసిన 68 ఏళ్ల బాలకృష్ణన్‌ కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేశారు.
చాలా చిన్న వయసులోనే విద్యార్థి ఉద్యమంలో చేరిన ఆయన విద్యార్థి నేతగా తనదైన ముద్ర వేశారు. 1973 నుంచి 79 వరకూ ఎస్‌ఎఫ్‌ఐ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన విద్యార్థి సంఘంగా తీర్చిదిద్దేందుకు అవిరళ కృషి చేశారు. ఆ తరువాత ఆయన యువజన సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరించి, అనంతరం కేరళ కర్షక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
బాలకృష్ణన్‌ మొదటి నుంచి పార్టీ అప్పగించిన బాధ్యతల నిర్వహణలో విశేష సామర్ధ్యాన్ని ప్రదర్శించారు. 1988లో కేరళ రాష్ట్ర కమిటీకి, 1995లో కార్యదర్శివర్గానికి ఎనిుకయ్యారు. 1990 నుంచి 1995 వరకూ రాష్ట్రంలో బలమైన కన్నూరు జిల్లా కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులను దీటుగా ఎదుర్కొంటూనే, పార్టీని బలహీనపరిచే చర్యలను తిప్పికొట్టారు. 17వ అఖిల భారత మహాసభల సమయంలో ఆయన కేంద్ర కమిటీకి, 19వ మహాసభలో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు.
బాలకృష్ణన్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా 2015 నుంచి 2022 వరకూ సేవలందించారు. ఆ సమయంలో పార్టీ నిలకడగా, స్థిరంగా విస్తరించింది.
రాష్ట్రంలోని తలస్సెరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమర్థవంతమైన శాసన సభ్యునిగా నిరూపించుకున్నారు. 2006 నుంచి 2011 వరకూ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంలో హోం, టూరిజం మంత్రిగా సమర్ధుడైన పరిపాలకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1975 నుంచి 1977 వరకూ ఎమర్జెన్సీ కాలంలో 18 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు.
మతతత్వ శక్తులకు వ్యతిరేక పోరాటంలో ఆయన గొప్ప యోధుడు. తలస్సెరిలో 1971 అల్లర్ల సమయంలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన ముందుపీఠిన ఉన్నారు. ఆ తర్వాత మతతత్వ శక్తులు విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడినప్పుడల్లా వారిపై పోరాటానికి నేతృత్వం వహించారు.
బహిరంగ వేదికలపై ప్రసంగాల్లో బాలకృష్ణన్‌ అసాధారణ ప్రతిభ చూపేవారు. పార్టీ రాజకీయ, సైద్దాంతిక వైఖరులను ఎంతో ప్రతిభావంతంగా వివరించేవారు. రాజకీయ, సైద్దాంతిక అంశాల్లో ఎంతో దృఢంగా ఉన్నప్పటికీ, అందరితో సుేహపూర్వకంగా ఉండేవారు. రాజకీయాల్లో వున్న అందరు నేతలతో మంచి సంబంధాలను కొనసాగించారు.
బాలకృష్ణన్‌ అచంచల విశ్వాసం, రాజకీయ, నిర్మాణ సామర్ధ్యాలు, పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల పట్ల చూపే ఆప్యాయత ఆయనను ఎల్లప్పుడూ గౌరవ స్థానంలో ఉంచుతాయి.
సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆయన స్మృతికి నివాళులర్పించింది. ఆయన భార్య, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది.