Aug 03,2022 13:29

తిరువనంతపురం : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేరళ వామపక్ష ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్‌-19 వల్ల ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఏక కాల పనులను పరిమితం చేయాలన్న నిర్ణయం పెద్ద ఎదురుదెబ్బగా మారునుందని పేర్కొంది. కేరళలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంవి గోవిందన్‌ తెలిపారు. ఇది కూలీలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా దక్షిణాది రాష్ట్రంలో పథకం అమలుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సరికొత్త నిర్ణయంపై తమ ఆందోళనలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ పంపినట్లు చెప్పారు. కోవిడ్‌ వల్ల ఏర్పడిన సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న స్థానిక ఆర్థిక రంగానికి భారీ ఎదురుదెబ్బ కానుందని, కార్మికులను సంక్షోభంలోకి నెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి ప్రకటనలో తెలిపారు. ఏక కాలంలో 20 పనులను మాత్రమే అనుమతినివ్వాలని ఆదేశించడం వల్ల కార్మిక రంగంలోనూ.. స్థానిక ఆర్థిక రంగంలోనూ సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ నిర్ణయం 100 రోజుల పాటు పనిదినాలు కల్పించాలన్న ఉపాధి హామీ పథకం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని అన్నారు. కేరళ, ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల నిర్మాణం చాలా భిన్నంగా ఉందని ఎత్తి చూపిన ఆయన.. కేరళలోని ఒక వార్డు కూడా ఇతర రాష్ట్రాలోని పంచాయతీ జనాభాను కలిగి ఉండవచ్చునని అన్నారు. కేరళలోని గ్రామ పంచాయతీలు 13 నుండి 23 వార్డులు కలిగి ఉన్నాయని, రాష్ట్రంలో ఏకకాల పనులు అమలు చేయడం ద్వారా అపారమైన కార్మికుల డిమాండ్‌ను తగ్గిస్తుందని గోవింద్‌ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 10 కోట్ల పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం కేవలం 6కోట్ల రోజుల మాత్రమే కేటాయించిందని తెలిపారు. ఆర్థిక సంవత్సరం నుండి మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రం ఇప్పటికే 2.43 కోట్ల పని దినాలను పూర్తి చేసిందని చెప్పారు.