Sep 14,2021 12:48

హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస(పీఓపీ) విగ్రహాలు నిమజ్జనం చేయవద్దన్న కోర్టు తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించడంతో .. అధికారలు తలలు పట్టుకుంటున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం చిన్నపాటి నిమజ్జన కొలనులు (బేబీ పాండ్స్‌) సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనంపై సందిగ్ధత ఏర్పడింది.

గ్రేటర్‌లో సుమారు 25 వరకు బేబీ పాండ్స్‌ ఉన్నాయి. ఈ కొలనుల వద్ద పూర్తిస్థాయిలో విగ్రహాల నిమజ్జనం కోసం సిద్ధం చేస్తున్నారు. చాలా వరకు కొలనులు ఒకే పరిమాణంలో ఉన్నాయని జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్‌ విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మెట్లతో నిర్మించిన కొలనులో పై భాగం 100 అడుగుల పొడవు, వెడల్పులో ఉండగా, అడుగున 60/30 అడుగుల వెడల్పు ఉంటుందని, లోతు 12 నుంచి 14 అడుగులు ఉంటుందని అన్నారు. ఆదివారం నుండి పలు కొలనుల్లో నిమజ్జనం ప్రారంభమైనట్లు తెలిపారు. పస్తుతం ఎనిమిది అడుగుల మేర నీళ్లు నింపి నిమజ్జనం చేస్తున్నట్టు ఖైరతాబాద్‌ జోన్‌కు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. నిమజ్జనం చేసిన విగ్రహాలను మరునాడు ఉదయం తొలగిస్తున్నారు. అవసరాన్ని బట్టి మరో 10 అడుగులు, అంతకంటే ఎక్కువ నీటిని నింపుతామని అన్నారు.

మహా నిమజ్జనం...
గ్రేటర్‌లో 25 వేల వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారని.. మహా నిమజ్జనం వచ్చే ఆదివారం జరగనుందని పోలీసులు తెలిపారు. ఒకేసారి అన్ని విగ్రహాలు నిమజ్జనం చేస్తే కొలనుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఐదు, ఆరు, ఏడు, తొమ్మిదో రోజు విగ్రహాలు నిమజ్జనం చేసేలా నిర్వాహకులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. విగ్రహాలను ఎక్కడికక్కడ బేబీ పాండ్స్‌లో నిమజ్జనం చేసేలా పోలీసులు మండపాల వారీగా పాసులు జారీ చేయనున్నారు.

ఖైరతాబాద్‌ విగ్రహం నిమజ్జనం..
ఈ యేడాది ఖైరతాబాద్‌లో 40 అడుగుల ఎత్తులో విగ్రహం ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు నేపథ్యంలోఈ విగ్రహం నిమజ్జనంపై చర్చ జరుగుతోంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసే అవకాశం లేకపోవడంతో జల విహార్‌ సమీపంలోని బేబీ పాండ్‌లో నిమజ్జనం చేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నెక్లెసరోడ్‌ మార్గంలో ఉన్న బేబీ పాండ్‌కు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లడం, కొలను వద్ద ప్రత్యేక క్రేన్‌ ఏర్పాటు చేయడం, నిమజ్జనం సాధ్యమా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ బేబీపాండ్‌ వద్ద కుదరని పక్షంలో పీవీ ఘాట్‌ సమీపంలోని కొలనులో నిమజ్జనం చేసే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. బాలాపూర్‌, ఇతర ప్రాంతాల్లోని పెద్ద విగ్రహాల నిమజ్జనానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.