Mar 19,2023 12:14

చండీగఢ్‌ :  ఖలిస్తానీ వేర్పాటు వాద సానుభూతిపరుడు, 'వారిస్‌ పంజాబ్‌ దే' నేత అమృతపాల్‌ సింగ్‌ ఇప్పటికీ పరారీలో ఉన్నట్లు ఆదివారం పంజాబ్‌ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.  అతనిని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. శనివారం సాయంత్రం జలంధర్‌లో అమృతపాల్‌ సింగ్‌ చిక్కినట్టే చిక్కి మోటార్‌సైకిల్‌పై పారిపోయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో కచ్చితమైన సమాచారం లేదని అన్నారు.  అయితే, అనుమానం ఉన్న అన్ని ప్రదేశాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.    దీంతో పంజాబ్‌ వ్యాప్తంగా   హై అలర్ట్‌ ప్రకటించారు. ఇంటర్నెట్‌పై నిషేధం కూడా విధించారు.

'వారిస్‌ పంజాబ్‌ దే' కి చెందిన 78 మంది సభ్యులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని విచారిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఆరు నుండి ఏడుగురు అమృతపాల్‌ సింగ్‌ గన్‌మెన్‌లు ఉన్నట్లు జలంధర్‌ పోలీస్‌ కమిషనర్‌ కుల్దీప్‌ సింగ్‌ చాహల్‌ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్న అమృతపాల్‌ సింగ్‌ సన్నిహితుడు దల్జీత్‌ సింగ్‌ కల్సిని కూడా హార్యానాలోని గుర్‌గావ్‌లో అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని.. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అమృతపాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ అమృతపాల్‌ తో  పాటు అతని మద్దతుదారులు ఫిబ్రవరి 24న అమృతసర్  జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగారు. సిక్కుల పవిత్ర గ్రంధంతో అమృతపాల్‌ , నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు లవ్‌ప్రీత్‌ను విడుదల చేశారు.