May 31,2023 22:06

మండల కార్యాలయానికి వచ్చిన ఎరువులు

ప్రజాశక్తి - పాచిపెంట : ఖరీఫ్‌కు కావాల్సిన ఎరువులు, విత్తనాలు సిద్ధం ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు తెలిపారు. మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో 200 టన్నుల యూరియా, 70 టన్నుల డిఎపి ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే 68 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు, 20 క్వింటాళ్ల నవధాన్య విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 700 క్వింటాళ్ల వివిధ రకాల వరి విత్తనాలు ఆర్‌బికెలకు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చిరుధాన్యాలు కూడా సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. గిరిజన రైతులకు విత్తనాలు 90 శాతం రాయితీపై ఇవ్వనున్నామని, మిగిలిన రైతులకు జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కిలో విత్తనానికి రూ.10 రాయితీ ఇస్తున్నామన్నారు. కావున రైతులంతా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకులంతా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువుల ధరలను ప్రదర్శించాలని, నిల్వలను కూడా రైతులకు తెలియజేయాలని తెలిపారు. ఈ ఏడాది ఎరువులకు, విత్తనాలకు ఎలాంటి కొరత ఉండదన్నారు.