Jul 28,2021 18:31

న్యూఢిల్లీ : నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసనలు ప్రారంభించి ఎనిమిది నెలలు కావస్తున్నా.. మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూనే వుంది. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశం చర్చకు కూడా రాకపోవడం శోచనీయం. అయితే జూన్‌ 26న జంతర్‌మంతర్‌ వద్ద 200 మందికి పైగా మహిళలు 'మహిళా పార్లమెంటు'ను నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు అన్ని పదవులను మహిళలే చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు మోడీ సర్కార్‌కు కొన్ని ప్రశ్నలను సంధించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మోడీ సర్కార్‌ ఈ వ్యవసాయ చట్టాలను ఎవరికోసం, ఎందుకు ఆమోదించిందని ప్రశ్నించారు. అలాగే వ్యవసాయన్ని ఆదానీ, అంబానీలకు ఎందుకు విక్రయించాలని చూస్తోందని ప్రశ్నించారు. 

ఈ పార్లమెంటులో పలు అంశాలపై చర్చ నిర్వహించారు. ఒక్కో అభ్యర్థికి మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయాన్ని కేటాయించారు. హిందీ, ఇంగ్లీష్‌, పంజాబీ, హర్యాన్వి(స్థానిక భాష)  భాషలను ఉపయోగించారు. మీరు ఆహారానికి ప్రాధాన్యత నివ్వకుండా దేనికి ఇస్తారు అని యుపిలోని సుల్తానాపూర్‌కి చెందిన పూజా కనొజియా ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా.. యోగి ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా సమయంలో ఆక్సిజన్‌ కూడా అందించని ప్రభుత్వానికి వ్యవసాయాన్ని అప్పగించలేమని.. అసలు ఎలా విశ్వసించగలమని అన్నారు. కరోనాకు ఎంతో మంది బలయ్యారని.. ఇప్పుడు ఆకలితో మా కుటుంబసభ్యులు మరణించేందుకు తాము అంగీకరించలేమని స్పష్టం చేశారు.

తాను రాజస్తాన్‌ - హర్యానా సరిహద్దు నుండి వచ్చానని, జొన్న, పెసలు, పత్తి, గోధుమలు వంటి పంటలను పండిస్తామని మనీష్‌ బిర్లా తెలిపారు. తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను ప్రకటించడం గానీ, ప్రభుత్వం సేకరించడం గానీ చేయలేదని అన్నారు. పత్తి పంటను తెల్లపురుగు ఆశించినా.. అది వార్త కానేకాదని అన్నారు. పైగా ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తున్న తమ రైతులు, వారి నివాసాలపై దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ పంటలనే తాము తినలేని పరిస్థితి ఏర్పడితే.. దేశం ఏంచేస్తుందని పంజాబ్‌కు చెందిన జస్ప్రీత్‌ కౌర్‌ ప్రశ్నించారు.

అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) కారణంగా కొన్నేళ్లుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. పార్లమెంట్‌ సభ్యురాలిగా డబ్ల్యుటిఒ నుండి భారత్‌ వైదొలగాలని తాను కోరుతున్నానని మరో మహిళా రైతు హర్‌ప్రీత్‌కౌర్‌ అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం నల్ల చట్టాలను రద్దు చేయడమేనని పూజాసింగ్‌ స్పష్టం చేశారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని రైతులను ఎందుకు ప్రశ్నిస్తారు? పరిష్కారం మోడీ చేతిలో ఉంది... ప్రధానినే ప్రశ్నించాలని అన్నారు. మహిళలు తమ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే.. ఇంటి బడ్జెట్‌ను కూడా చూసుకుంటారని, కానీ మోడీ సర్కార్‌ ద్రవ్యోల్బణం, వ్యతిరేక విధానాల కారణంగా దేశంలోని ప్రతి ఇల్లు బాధపడుతోందని, మహిళలు ఈ విప్లవంలో భాగస్వామ్యమయ్యారని కిసాన్‌ సంసద్‌ పర్యవేక్షకుడు యుద్వీర్‌ సింగ్‌ అన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని, పార్లమెంటులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుకుంటున్నామని సప్నా యాదవ్‌ పేర్కొన్నారు. మహిళల సాధికారత లేకుండా సామాజిక న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఈ సెషన్‌లో మూడు అంశాలు నీటి కొరత, పెరుగుతున్న ఇంధన ధరలు, మహిళల విద్య తదితర అంశాలపై చర్చ నిర్వహించారు. తమ పొలాలను కార్పొరేట్లకు కట్టబెట్టడం,. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడంతో లాభాలు ఉండవని, దీంతో రైతుల పిల్లలు నిరుద్యోగులుగా మారతారని, నెమ్మదిగా గ్రామాల్లో ఆకలి పెరిగిపోతుందని పరమ్‌జీత్‌కౌర్‌ అన్నారు.

ఈ సమావేశంలో ప్రముఖ హక్కుల కార్యకర్త మేథా పాట్కర్‌, నటి గుల్‌ పనాంగ్‌లు కూడా హాజరయ్యారు. ఈ రైతుల తిరుగుబాటు వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, రైతులు, మహిళలు అందరినీ ఒక్కచోట చేర్చిందని, ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమమని, ఏ ప్రభుత్వమూ వీటిని విస్మరించకూడదని మేథా పాట్కర్‌ పేర్కొన్నారు. మహిళలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలరని, ఎవరూ ఓడించలేరని ఈ సంసద్‌ ద్వారా చూపించారని అన్నారు. పార్లమెంటులో పలు సమస్యలపై చర్చలు నిరంతరాయంగా కొనసాగాయి.

అనంతరం ఈ పార్లమెంటులో వ్యవసాయ మంత్రిగా ప్రకటించిన మహిళా రైతు సభను ఉద్దేశించి మాట్లాడారు. విమర్శలన్నింటినీ స్వీకరించామని, ఈ చట్టాలు మన దేశానికి ప్రయోజనం కాదని, ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మోడీ, షాల ద్వయం దేశంలోని తల్లి, చెల్లెళ్ల చర్చలను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తప్పక విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. సమస్యలను చర్చించారని.. ఈ సందర్భంగా మహిళా రైతులు ఎన్నో ఏళ్ల నుండి దేశంలో వేళ్లూనుకొన్న సమస్యలపై ప్రవేశపెట్టిన రెండు బిల్లులను ఆమోదించాయి. 'నిత్యావసర వస్తువుల సవరణా చట్టానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానం, 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఈ పార్లమెంటులో ఆమోదం పొందాయి.