Sep 25,2021 12:01

చల్లపల్లి (కృష్ణా) : ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి, కఅష్ణా జిల్లా తూర్పు కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 27 న చేపట్టనున్న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ... చల్లపల్లిలో ఆటో ద్వారా మైక్‌ ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు వాకా రామచంద్రరావు మాట్లాడుతూ.... బిజెపి ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకుందామని, సెప్టెంబర్‌ -27 న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలు, విద్యుత్‌ బిల్లు రద్దు చేయాలని కోరారు. మద్దతు ధర గ్యారంటీ చట్టం తేవాలని, నాలుగు లేబర్‌ కోడ్లు ఉపసంహరించుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, ఆదాయ పన్నేతర కుటుంబాలకు నెలకి రూ.7,500 చొప్పున ఆరు నెలలు ఇవ్వాలని, ఉపాధిహామీకి నిధులు పెంచి 200 రోజులు పని రూ.600ల వేతనం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాలకు ఉపాధి పధకం వర్తింపచేయాలని, ఉపాధి వేతనాలు కులాలవారిగా చెల్లింపులు రద్దు చేయాలని, కౌలు రైతుల రక్షణ కోసం చట్టం తేవాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ, మోనిటైజేషన్‌ పైన్‌ ఆపాలన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించి భారత్‌ బంద్‌ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.