Apr 20,2021 22:44

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరోనా రెండో దశ కల్లోలంతో యావత్‌ దేశం విలవిల్లాడుతోంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో విరుచుకుపడుతూ వణికిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ల బాటలో పయనిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీల్లో లాక్‌డౌన్‌ ప్రకటించగా.. తాజాగా జార్ఖండ్‌ కూడా అదే బాటలోకి వెళ్లింది. రాష్ట్రంలో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ లాక్‌డౌన్‌ ఈనెల 22 నుంచి 29 వరకు వారం రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొంటూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌లు అమలవుతున్నాయి. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమల్లో ఉండగా నిత్యావసర దుకాణాలపై ఆంక్షలు విధించింది. కిరాణాలు, కూరగాయలు, పండ్లు తదితర నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ నాలుగు గంటల పాటు మాత్రమే తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోండెలివరీని అనుమతించింది.

ఒక్కరోజే 1,761 మరణాలు
కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతోంది. గత ఆరు రోజులుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 2,59,170 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. 1761 మంది ప్రాణాలు విడిచారు. మొత్తం కేసుల సంఖ్య 1,53,21,089కు, మరణాల సంఖ్య 1,80,550కు పెరిగింది. గత 24 గంటల్లో 1,54,761 మంది డిశ్చార్జి అవ్వగా, ఇప్పటివరకు 1,31,08,582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 20,31,977 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 12,71,29,113 వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చారు.

కరోనా బారిన ప్రముఖులు
కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. రాహుల్‌ గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత కరోనా బారిన పడ్డారు. కేజ్రీవాల్‌ హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు.