Jan 18,2021 07:13

   సి పిల్లల ఎదుగుదలలో కీలకపాత్ర పోషించేది తల్లి. తల్లుల జీవితాలు పిల్లల చుట్టూ గూడు అల్లుకొని ఉంటాయి. బిడ్డలకు ఎలాంటి బాధ కలిగినా తల్లి తల్లడిల్లిపోతుంది. పిల్లలను ఆడించడానికి, స్నానం చేయించడానికి, అన్నం తినిపించడానికి, నిద్రపుచ్చే సమయాల్లో తన ఎదలోంచి పొంగి పొర్లి వచ్చే పాటనే లాలిపాట. బిడ్డల పట్ల తనకు గల మమకారాన్ని, అనురాగాన్ని కలబోసి కూర్చిన అంతరంగ తరంగాలే లాలిపాటలై తరతరాల తరగని ఆస్తిగా నేటికీ వినవస్తున్నాయి.
   ''తల్లి తన ఆనందాన్ని, అనుభవాన్ని, ఆవేదనల్ని, ఆలోచనల్ని బిడ్డకు వ్యక్తీకరిస్తూ బిడ్డను లాలించడానికి, నిద్రపుచ్చడానికి గొంతెత్తి గానం చేస్తుంది. తల్లి గొంతు బిడ్డకు సర్వకాల సర్వావస్థల్లోనూ మధురమే. ఆ స్వర మాధుర్యానికి తన్మయత్వంతో నిద్రపోయే భాగ్యశాలురు శిశువులు. శిశువుల కోసం పుట్టుకొచ్చిన లాలిపాటలు ప్రపంచం నలుమూలల తల్లుల గొంతుల్లో తారాడుతూ ఉన్నాయన్నది అక్షర సత్యమని ఈ పరిశోధన సిద్ధాంత గ్రంథానికి ముందుమాట రాసిన ఆచార్య కొలవెన్ను మలయవాసిని పేర్కొన్నారు.
నేటి కాలంలో పాటలు, సంగీతం కావాలంటే టీవీలపై, సెల్ఫోన్లపై ఆధార పడవలసిన వస్తుంది. ఇవి అందించే ధ్వనులు మధురంగానే ఉన్నా తల్లి నోటి వెంట వెలువడే ముత్యాల్లాంటి లాలిపాటలంటేనే పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డలకు ఎంతో ఇష్టం. ప్రతి ఒక్క శిశువుకు ఏదో ఒక సందర్భంలో తల్లి తనకు వచ్చిన రెండు మూడు చరణాలు అయినా పాడే ఉంటుంది. ఆ లాలింపులో బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. తల్లి గొంతులో ఆత్మీయత, అనురాగాలు నిండుకొని ఉంటాయి.
    జానపద సాహిత్యంలో లాలిపాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆచార్య డి.విజయలక్ష్మి గారికి తెలుగు, తమిళ భాషలపై పట్టు ఉంది. ఈ భాషల్లోని లాలిపాటలను సేకరించి భాషా సామాజిక విషయ పరిశీలన చేసి, చక్కని పరిశోధన చేసి, లాలిపాటల అణిముత్యాలను వెలికితీశారు. మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన, కనుమరుగైపోతున్న లాలిపాటల మాధుర్యాన్ని ముందు తరాలకు అందించేందుకు విలువైన సిద్ధాంత గ్రంథంగా అందించారు.
   ''లాలిపాటలను పరిచయం చేయడంతో పాటు పౌరాణిక, చారిత్రక, సాంఘిక రంగాలకు సంబంధించిన లాలి పాటలను వెలుగులోకి తెచ్చారు. లాలి పాటలు కుటుంబ జీవనం, సామాజిక జీవనం, సాంస్క ృతిక, భాష వంటి అంశాలు వివరించడం ద్వారా మన సంస్కృతిలోని లాలిపాటల పాత్ర, వాటి ప్రాధాన్యత బోధపడు తుందని చొక్కాపు వెంకట రమణ అన్నారు.
''నిద్రపో నిద్రపో చిట్టి నా తల్లి
నిద్రకు నూరేళ్లు, నీకు వెయ్యేళ్లు''
అంటూ తల్లి రాగం తీస్తుంది. పాటలోని మాధుర్యం, అమ్మ ఒడిలో వెచ్చదనం పాప హాయిగా నిద్రలోకి జారుకుంటుంది. అమ్మ కనిపించే పోయేసరికి పాప ఏడుపు అందుకుంటుంది. పనిలో ఉన్న తల్లి హడావిడిగా పరిగెత్తుకొచ్చి, బిడ్డని ఎత్తుకొని ...
''ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను''
అంటూ బుజ్జగిస్తుంది. తల్లి గొంతులోని లయ, మాధుర్యం, సాన్నిహిత్యం, శరీర స్పర్శ, వారి మనసులను తేలికపరిచి ధైర్యాన్ని, భరోసాను అందిస్తాయి. జానపద సాహిత్యంలో స్త్రీల పాటలు తరతరాల స్త్రీల జీవనగమనంలోని అనుభవాలు, స్త్రీల జానపద గేయ సాహిత్యంలో లాలిపాటలు ఒక ప్రధానమైన ఉప విభాగమై, విశిష్ట స్థానం పొంది ఉన్నాయి. బిడ్డ పుట్టుకతోనే లాలిపాట పుట్టింది. సరిగమలు అంటే కూడా తెలియని స్త్రీలు తల్లి కాగానే రాగాలు తీస్తుంది. తల్లిబిడ్డల ముద్దు మురిపాలనకు వారథి ఈ లాలిపాట. ప్రపంచంలో లాలిపాట పాడని తల్లే ఉండకపోవచ్చు. మాతత్వం అందించిన ఓ కమ్మని ఆలాపనే లాలిపాట. బిడ్డను జోకొట్టి, నిద్ర పుచ్చడానికే కాకుండా తన ఆనందాన్ని, ప్రేమని, కోరికలని, బాధను వ్యక్తం చేసుకోవడానికి లాలిపాటతో హృదయావిష్కరణ చేస్తుంది.
    లాలిస్తూ పాడడం వల్ల లాలిపాటని, జోకొడుతూ పాడడం వల్ల జోలపాటని, ఉయ్యాలలూగుతూ ఉయ్యాల పాటని, దాదులు పాడే పాటను దాది పాటని, బుజ్జగింపు వల్ల బుజ్జగింపు పాటలని, ముద్దాడుతూ పాడితే ముద్దు పాటలని ఈ పాటలకు పేర్లు ఏర్పడ్డాయి. ఈ పాటలు ఎక్కువగా ఆనంద భైరవి, శ్రీరాగం, నవభోజరాజ రాగంలోనూ ఉంటాయి. తెలుగు పాటల్లో తరచుగా శ్రీరాముడిని, శ్రీకష్ణుడిని ప్రస్తావించారని, తమిళ గేయాల్లో శివుడిని, మీనాక్షిని, సుబ్రహ్మణ్య స్వామిని అధికంగా ప్రస్తావిస్తారనే విషయం ఈ పరిశోధనలో తెలుస్తుంది. లాలిపాటలు ప్రత్యేకంగానే కాకుండా విల్లు పాటలనబడే జానపద ప్రదర్శన గేయాల్లోనూ, చారిత్రక కథల్లోనూ, మత సంబంధ కాలక్షేప కథల్లోనూ చోటు చేసుకుని ఉన్నాయి.
తమిళ శిష్ట సాహిత్యంలో ప్రాచీనకాలం నుంచి లాలిపాటలు ప్రాశస్త్యం వహించి ఉన్నాయి. పెరియాళ్వార్‌ కవి మొదటగా లాలిపాట రాశాడు. బాలకృష్ణుని లీలలను యశోద లాలిపాటగా పాడినట్లు రచించారు. ఇతని అనుసరిస్తూ కులశేఖరాల్వార్‌ 'రామచరిత' అనే పత్తుపాడల్‌'లో లాలిపాట రచించారు. 15వ శతాబ్దం నుంచి తమిళంలో లాలిపాటలు బాల సాహిత్యంలో ప్రత్యేక ప్రబంధాలుగా రూపుదిద్దుకున్నాయి. వీటిలో గీతాసారమనే లాలిపాట ప్రసిద్ధి పొందింది. చీర్‌ కాళి చిట్‌ రంబల్‌ అడిగలర్‌ మొదలుకొని స్వామినాధన్‌ వరకు పాడిన లాలిపాటలు ఈ కోవకు చెందినవే. ఇవన్నీ ప్రాచీనకాలం మొదలుకొని నేటి వరకు ఆధునిక భావదృష్టితో రాసిన లాలిపాటలు. వీరిలో భారతిదాసన్‌, కన్నదాసన్‌, వాణి దాసన్‌ మొదలైన వారు ప్రముఖులు.
     వైష్ణవ క్షేత్రాల్లో విష్ణువు మీద, దేవేరి మీద పాడిన లాలిపాటలు 19వ శతాబ్దంలో అనేకం. వీటిలో రాజగోపాల్‌ పెరుమాళ్‌ పాట ప్రసిద్ధి పొందింది. రాముని బాల్యదశను కులశేఖర్‌ అల్వార్‌ కవి లాలిపాటగా రాశారు.
''మన్ను పుగల్‌ కౌచాలందన్‌
మనివయిర్‌ వాడుత్తవనే
తెన్నులంగైచ్‌ కోన్‌ ముడిగల్‌''
అని ఈ పాట సాగుతుంది. తెలుగులో కూడా రాముని బాల్యం గురించి తెల్పే అంశాలతో పాటలు ఉన్నాయి.
''జోల పాడి జో కొడితే ఆలకించేవు
చాలించి ఊరకుంటే సజ్ఞ చేసేవు
ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతు రా
బుంగ పట్టుకొని పెద్ద బూచి వచ్చేను...''
అని వర్ణిస్తూ రాశారు.
వీటితోపాటు అవిభక్త కుటుంబ వ్యవస్థను వ్యక్తీకరించే లాలిపాటలు తెలుగు, తమిళ భాషల్లో చాలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబంలోని సమిష్టి కృషి పాటల్లో ప్రతిఫలిస్తుంది.
''కట్టించే మీ నాయన కనక మండపము
చేయించే పెదనాయన వెండి గోపురము
పరిపించే చిననాయన నల్లని రాళ్లు
అడుగుబోయి మీ అవ్వ అరుగు లెయించే
మళ్ళీ బోయి మీ అత్త మల్లేవనమేసే..''
అడ్డాల బిడ్డ లాలింపు, అదలింపుపై కుటుంబంలో అందరి జోక్యం ఉంటుంది. అపార్థాలకు చోటు ఉండదు. తల్లి సోదరుడు మేనమామ. తల్లితండ్రి లేని బిడ్డలకు మేనమామే తండ్రి అనే సామెత కూడా మేనమామల ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. మేనమామలు వారి అక్కలకి, చెల్లెళ్లకి పిల్లలు పుడితే ఎంతగా ఆనందపడతారో తెలిపే లాలిపాటలున్నాయి. చిన్నాన్న, పెదనాన్నలపై, చిన్నమ్మ, పెద్దమ్మలపై, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు పిల్లలు పుట్టగానే వారి హావభావాలపై, ముద్దు మురిపాలపై చెప్పలేనన్ని లాలిపాటలున్నాయి. ఇంత గొప్పవైన లాలిపాటలు మౌఖిక రూపంలో నేటికీ ఎన్నో ఉన్నాయి. వాటిని రేపటి తరాలకు అందించడం కోసం మరిన్ని పరిశోధనలు జరగాలి.. లిఖిత రూపంలో భద్రపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భవిష్యత్తులో మరిన్ని లాలిపాటలు సేకరణ జరగాలి.

- బి.మహేష్‌,
పరిశోధక విద్యార్థి,
89852 02723