Feb 27,2021 01:21

మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
రవాణా రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా అఖిల భారత పిలుపు మేరకు శుక్రవారం విశాఖపట్నం లారీ ఆపరేటర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన చేపట్టిన లారీ బంద్‌ విజయవంతమైంది. ఎక్కడ లారీలను అక్కడే నిలిపివేసి బంద్‌ పాటించారు. దీంతో విశాఖ రవాణా రంగం స్తంభించిపోయింది. సుమారు రూ.100కోట్ల వరకూ నష్టం వాటిల్లి ఉంటుందని ఆపరేటర్స్‌ చెబుతున్నారు. డీజిల్‌ పెంపునకు నిరసనగా, రోడ్డు టాక్స్‌ను 4 క్వార్టర్లలో రెండు క్వార్టర్లను కోరుతూ విశాఖపట్నం నాయుడు తోట, పోర్టు ఎగ్జిమ్‌ పార్కు గేటు వద్ద కేంద్ర విధానంపై లారీ ఓనర్లు, కార్మికులు నిరసన తెలిపారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇందులో పాల్గొని లారీల సమ్మెకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలు పెంచడాన్ని తాము నిరసిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్మికులు, లారీ ఓనర్లు నినాదాలు చేస్తూ స్క్రాప్‌ పాలసీని సవరించాలని, ఇ-వే బిల్లులకు ఇచ్చే సమయాన్ని పెంచాలని, టోల్‌గేట్‌ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో నష్టపోయిన లారీ ఓనర్స్‌కు రోడ్డు టాక్స్‌ను రెండు క్వార్టర్లు మినహాయించాలని కోరారు. సంఘం అధ్యక్షులు పికె సోమశేఖర్‌, మాజీ అధ్యక్షలు పీలా అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి కె.అర్జునరావు, కోశాధికారి పి.లక్ష్మీనారాయణ, మేనేజర్‌ పి. శ్రీనివాసరావు సహా లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు. ఇవే డిమాండ్లపై క్వారీ లారీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఇసుక తోట) జంక్షన్‌ వద్ద గల లారీల సంఘం ఆధ్వర్యాన 300 లారీలు ఆగిపోయాయి. జ్ఞానాపురం, పెందుర్తి, కొత్తవలస కలుపుకుని 3 వేల లారీలకు పైగా నిలిచిపోయాయి.లారీ సంఘం అధ్యక్షులు పొట్టి రమణ, వెంకట, బాబు పాల్గొన్నారు.
అచ్యుతాపురంలో జయప్రదం
అచ్యుతాపురం:దేశవ్యాప్త పిలుపులో భాగంగా అచ్యుతాపురం జంక్షన్లో శుక్రవారం కనకదుర్గ లారీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో లారీల బంద్‌ విజయవంత మైంది. ఈ సందర్భంగా పరిశ్రమలకు వెళ్లే 125 లారీలను నిలిపివేసి బందును స్వచ్ఛందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం జంక్షన్‌లో వాహనాల రాకపోకలు నిలిచాయి. కనకదుర్గ లారీ అసోసి యేషన్‌ అధ్యక్షులు ఈశ్వరరావు మాట్లాడుతూ, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో లారీల నిర్వహణ భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. టోల్‌ రుసుము ధరలను తగ్గించి లారీ యాజమానులకు ఉపశమనం కలిగించా లన్నారు. ఇ-వే బిల్‌ సమయం పెంచి లారీ యాజమానులను ఆదుకోవాలని కోరారు. పోరాటాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే ఆంద్రప్రదేశ్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌కు మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రతినిధులు పాల్గొన్నారు.