Oct 26,2021 18:39

క్రిస్టెల్‌ హార్ట్‌సింగ్‌.. స్విట్జర్లాండ్‌ నుంచి రెడ్‌క్రాస్‌ కోసం స్వచ్ఛందంగా భారతదేశానికి వచ్చిన మహిళ. దేశంలో లైంగిక వేధింపులకు గురైన పిల్లలను చూసి చలించిపోయి, వారికోసం ఒక హోమ్‌ను ఏర్పాటు చేసి ఇక్కడే స్థిరపడ్డారు. వీధి పిల్లలు, హెచ్‌ఐవి రోగులకు ఆమె ఆశ్రయం కల్పిస్తున్నారు.
రెడ్‌క్రాస్‌లో ఉద్యోగం కోసం వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి క్రిస్టెల్‌ భారతదేశాన్ని ఎంచుకున్నారు. 2000లో కేరళలోని త్రివేండ్రం సమీపంలో ఒక ఎన్‌జిఒలో వాలంటీరుగా చేరారు. నాలుగు నెలల్లోనే ముంబైలోనివీధి పిల్లలకు ఆశ్రయం, విద్య అందించే డాన్‌బాస్కో సెంటర్లో ఉద్యోగం పొందారు. ఆరొల్ల తర్వాత స్విట్జర్లాండ్‌ వెళ్లి తిరిగొచ్చిన క్రిస్టెల్‌ పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యారన్న వార్త విని దిగ్భాంత్రికి గురయ్యారు. సీనియర్లు ఏ చర్యా తీసుకోకపోవడంతో, ఆమె ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇండియాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో విడుదలైన 'దిల్‌సే' చిత్రంలోని పాటలను పిల్లలు ఇష్టంగా పాడుతుండడం గమనించిన క్రిస్టల్‌ 'దిల్‌సే' పేరుతో ఒక ఎన్‌జిఒ స్థాపించారు.

లైంగిక వేధింపు బాధితులకు అండగా...
విదేశీయురాలిగా ఎన్‌జిఒను ప్రారంభించేందుకు చట్టాలను తెలుసుకున్నారు. ఆస్తులను విక్రయించి, స్విట్జర్లాండులో నిధులు సేకరించారు. స్నేహితురాలు మెరినీ రేసిన్‌ సహాయంతో ముంబైలో 'దిల్‌సే' ఏర్పాటైంది. పేవ్‌మెంట్‌ స్కూలుగా ప్రారంభమైన 'దిల్‌సే'ను కొంతమంది బెదిరింపులతో ఆపవలసి వచ్చింది. ''మేము పిల్లల లైంగిక వేధింపులను కనుగొన్న విదేశీ మహిళలం. మేము నగరం నుంచి దూరంగా ఉండాలని, బాధిత పిల్లలకు సంబంధించిన ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని వారు ఆంక్షలు విధించారు'' అని చెప్పారు క్రిస్టెల్‌.

లైంగిక వేధింపు బాధితులకు అండగా...
త్రివేండ్రంలో ఒక జంట సహాయంతో నగరానికి దూరంగా చిన్న గృహాన్ని ప్రారంభించి వీధి, నిరుపేద పిల్లలకు ఆశ్రయం, విద్య అందించారు. 2005 నుంచి మధురై ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పీస్‌ సైన్స్‌తో కలిసి హెచ్‌ఐవి బాధితులకు సహాయం చేస్తోంది 'దిల్‌సే'. సమాజం చేత వెలివేయబడిన వితంతువులకు విద్యా సామగ్రి, ఆహారం అందిస్తూ, అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలిచింది. హెచ్‌ఐవి సోకిన పిల్లల కోసం 'దిల్‌సే' ఒక ఇంటిని నిర్మించింది. అక్కడ మేనేజింగ్‌ ట్రస్టీ మోసంతో 2009లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపై క్రిస్టెల్‌ ఇప్పటికీ న్యాయం పోరాటం చేస్తున్నారు.
వివాహం తర్వాత క్రిస్టెల్‌ కొచ్చిన్‌లో స్థిరపడ్డారు. 2012లో లైంగిక వేధింపులకు గురైన 13 ఏళ్ల బాలిక గురించి ఒక సామాజిక కార్యకర్త ద్వారా తెలుసుకున్నారు. ఆ అమ్మాయి గర్భవతి. తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేశారు. భర్త లైంగికంగా వేధించేవాడు. ఆమెకు ప్రసవం అయ్యేవరకు 'దిల్‌సే'లో ఉంచారు. ఆ సమయంలో క్రిస్టెల్‌ కూడా గర్భవతి. క్రిస్టెల్‌ తనకు పుట్టిన కుమారుడికి తేజ్‌ అని, నాలుగు రోజుల తర్వాత పుట్టిన ఆ అమ్మాయి కొడుకుకు తేజుస్‌ అనిపేరు పెట్టారు.
ఈ సంఘటనతో క్రిస్టెల్‌ లైంగిక వేధింపులకు గురైన బాలికల కోసం ప్రత్యేకంగా ఒక హోమ్‌ ఏర్పాటు చేసి, దానికి తనకు స్ఫూర్తినిచ్చిన బిడ్డ 'తేజుస్‌' పేరు పెట్టారు. ఈ హోమ్‌లో ఉండే బాలికలను 'పిల్లలకు జన్మనిస్తున్న పిల్లలు' అంటారు క్రిస్టెల్‌. తేజుస్‌ హోమ్‌కు వచ్చే కొంతమంది బాలికలకు కుటుంబాల మద్దతు ఉండదు. చాలా సందర్భాల్లో అఘాయిత్యాలకు పాల్పడ్డవారు కుటుంబ సభ్యులు, సుేహితులే అయివుంటారు. కేసు నడుస్తున్నప్పటికీ, బెయిల్‌పై వచ్చిన నిందితుడి దగ్గర నివసించడం అమ్మాయికి మరింత హాని చేస్తుంది. మానసికంగా కుంగదీస్తుంది. కొంతమంది అమ్మాయిలు చట్టబద్ధమైన 'మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగొన్సీ'ని కోరుకుంటారు. కొందరు శిశువును తమతోనే ఉంచుకుంటారు, కొందరు దత్తత ఇచ్చేస్తారు. అయితే గర్భధారణ సమయంలో వారికి సురక్షితమైన వాతావరణాన్ని తేజుస్‌ హోం కల్పిస్తుంది.

లైంగిక వేధింపు బాధితులకు అండగా...
ఇప్పటి వరకు తేజుస్‌ హోమ్‌ వివిధ దశల్లో గర్భధారణతో వచ్చిన 55 మంది బాలికలకు ఆశ్రయం ఇచ్చింది. వారికి కౌన్సిలింగ్‌, ఆర్ట్‌ థెరపీ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆంక్షలు ప్రశాంత జీవితాన్ని అందించింది. వైద్య అవసరాలను సహజ ప్రసూతి కేంద్రం 'బర్త్‌ విలేజ్‌' చూసుకుంటుంది. సిజేరియన్‌ అవసరమైన అమ్మాయిలు భవిష్యత్తు గురించి బాధపడుతుంటారని క్రిస్టెల్‌ అన్నారు. ''భారతదేశంలో లైంగిక వేధింపులకు గురైన బాలికలకు మేము మాత్రమే ఇలాంటి సహాయాన్ని అందిస్తున్నాము'' అంటారు క్రిస్టెల్‌. 'బర్త్‌ విలేజ్‌' అత్యాధునిక ప్రసూతి కేంద్రం, ఆపరేషన్‌ థియేటర్‌, న్యూబార్‌ు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ను కలిగివుంది. తేజుస్‌ హోమ్‌తో పాటు, పాఠశాలలు, కళాశాలల్లో వెబినార్లు నిర్వహిస్తూ వివిధ అంశాలపై టీనేజర్లకు అవగాహన కల్పిస్తోంది 'దిల్‌సే'.