
ప్రజాశక్తి - ఆమదాలవలస: లేగ దూడలను సంరక్షించి కాపాడాలని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శివ్వాల మన్మథరావు అన్నారు. శుక్రవారం సరుబుజ్జిలి మండలం కొండవలసలో పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎంపిటిసి లావేటి అనిల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్మథరావు మాట్లాడుతూ లేగ దూడల పెంపకం ఆవశ్యకతను వివరించారు. లింగ నిర్ధారణ వీర్యంను ఉపయోగించి ఆడ దూడలు పుట్టే పథకంపై రైతులకు అవగాహన కల్పించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్. సుబ్రహ్మణ్యం దూడ యాజమాన్యం, పోషణ గురించి వివరించారు. ఈ ప్రదర్శనలో హెచ్‌ఎఫ్, జెర్సీ, గిర్ జాతులకు చెందిన ఆడ దూడలను తీసుకొచ్చి రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డిఎల్‌డిఎ పశు వైద్యులు రాధాకుమార్ ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈ ప్రదర్శనలో దూడలకు బాగా పోషణ చేసిన రైతులు బొత్స వెంకటరమణ, చీపురు సూర్యనారాయణలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను, మిగిలిన రైతులకు కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు లావేటి విశ్వేశ్వరరావు, సద్గురు గురువులునాయుడు, పశు వైద్యులు డాక్టర్ సతీష్‌కుమార్, ఎస్.కరుణ, పశువైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.